నేడు దేశం, ప్రపంచం బాగుపడాలంటే ఆధ్యాత్మికత ఎంతో ముఖ్యం. బంధుప్రీతి, శారీరక సుఖాలు, కోట్లాది రూపాయల సంపాదన అంతా బూటకమని, కేవలం మనం బతికున్నంత కాలమే తప్ప పైకి పోయేటప్పుడు ఏమీ మనతో రావనే ఆధ్యాత్మిక చింతన ప్రజల్లో పెరిగి, అలాంటి భావాలు వచ్చిన రోజు మాత్రమే సమాజంలోని పలు రుగ్మతలు, అవినీతి, కోట్ల సంపాదన, పదవీకాంక్ష వంటి వాటికి కాస్తైనా కళ్లెం పడుతుంది. అందునా వేద భూమిగా, కర్మభూమిగా పిలుచుకునే భారతదేశంలో మన పెద్దలు, తాత్విక వేత్తలు చెప్పే ఆధ్యాత్మిక చింతన, నేను, నా వాళ్లు, నా కులం, నా మతం అనేవి అంతం కావాలంటే స్పిర్చివాలిటీని మించి మనిషిని ఉన్నత ఆలోచనల దిశగా నడిపించే మార్గమే లేదు. మనుషులలోని అన్ని అవలక్షణాలకు ఇదే సరైన మందు. ఇదంతా వినడానికి ఏదో సోదిలా అనిపిస్తుంది గానీ రమణమహర్షి నుంచి జిడ్డు కృష్ణమూర్తి వరకు అందరు చెప్పే సారం ఇదే. కర్మని చేయాలి గానీ అది మనల్ని అంటకూడదని, వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే భగవద్గీత వంటివే మనిషికి చివరి మజిలీకి సరైన మార్గం.
ఇక ఇందులో రజనీకాంత్ ముందుంటాడు. ఇండియన్ సూపర్‌స్టార్ అయినా ఆయన మార్గం, ఆలోచన, ఆయన వేషధారణ అన్ని ఇదే స్పిర్చువల్‌నెస్‌ని సూచిస్తూ ఉంటాయి. ఇక ఈయన ఏ కొత్త పని చేపట్టినా ముందుగా యోగి పరమహంస, మహా అవతార్ బాబాజీ మార్గంలో పయనిస్తూ ఉంటాడు. దేవుడు ఉన్నాడా లేదా? అనేది పక్కనపెడితే దేవుడు ఉన్నాడు అనే భావన వల్ల మానసిక ఆందోళనలు, వ్యక్తిపూజలు, వ్యక్తి ఆరాధనలు, నా అనే ఆలోచనలు తగ్గి మనిషిని నిజమైన ఋషిగా చేస్తాయి. ఇక రజనీ తరుచుగా విశ్రాంతి దొరికితే సామాన్యునిలా లాల్చీ ఫైజమా వేసుకుని చింపిరి జుట్టు, గడ్డం, చేతిలో ఊతకర్ర, భుజానికి జోలె వేసుకుని హిమాలయాలలోని దునగిరిలో ఉన్న గుహల్లోకి వెళ్లి ధ్యానం చేస్తూ గడుపుతాడు. అక్కడే మహామహులు తపస్సు చేసినట్లుగా హిందువులు భావిస్తారు. భారత ఆధ్యాత్మిక వృద్దికి జన్మస్థలం ఇదేనని నమ్ముతారు. కాగా త్వరలో రజనీ తన సొంత రాజకీయ పార్టీని స్థాపించనున్నాడు. ఇలాంటి కీలక నిర్ణయం తీసుకునే ముందు ఆయన హిమాలయాలకు వెళ్తున్నాడని వార్తలు వచ్చాయి.
కానీ ఈ వార్తలు నిజమో కాదో తెలియక పలువురు రజనీ రాజకీయాలలో బిజీగా, ఇంకా ఇతర పనులన్నీ పూర్తి చేయాల్సిన వేళ హిమాలయాలకు వెళ్లే సమయం ఉండదేమో అని వ్యాఖ్యానించారు. కానీ తలైవా హిమాలయాలకు వెళ్తున్న విషయం నిజమేనని రజనీ ప్రతినిధి రియాజ్ అహ్మద్ ప్రకటించాడు. మరి రాజకీయాలలోకి వచ్చే ముందు రజనీ వెళ్లే యాత్ర ఇదే కావడం విశేషం. మరి రజనీ చెబుతున్న స్పిర్చువల్ పాలిటిక్స్‌ని ఆయన ప్రజల మనసుల్లో ఎలా నాటుతాడో వేచిచూడాల్సివుంది...! ఇక ఆయన నటించిన 'కాలా' చిత్రం ఏప్రిల్ 27న విడుదల కానుండగా, '2.0' చిత్రం ఆగష్టు 15 లేదా దీపావళి, ఇంకా కాదంటే వచ్చే పొంగల్‌కి విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.