మన పక్కవారిని చూసి మనం ఏమిటో చెప్పవచ్చు అని పెద్దలు చెప్పారు. అంటే మన మిత్రులని చూస్తే మనం ఏమిటో తెలిసిపోతుంది..! ఇక రాజకీయాలలో అవకాశ వాదం, ఏ ఎండకా గొడుగు పట్టడం మామూలే. రాజకీయాలలో హత్యలు ఉండవు... కేవలం ఆత్మహత్యలే ఉంటాయని అంటారు. ఇందులో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. కేంద్రం నుంచి టిడిపి మంత్రులు రాజీనామా చేసినా కూడా ఇంకా టిడిపి ఎన్టీయేలోనే కొనసాగడం, సుజనా చౌదరి వంటి వారికి మోదీ ఇప్పటికీ నమ్మకస్తుడుగా కనిపిస్తూ ఉండటం ఆశ్చర్యకరం. ఇక రాజకీయాలంటే ఒంట పట్టించుకునే లోపే సంయమనం కోల్పోయి చిరంజీవి దెబ్బతిన్నాడు. కానీ పవన్‌కి మాత్రం ఇంకా ఎన్నికలకు ఏడాది కాలం ఉండగానే జ్ఞానోదయం కావడం విశేషం. ఈ విషయంలో తత్వాన్ని త్వరగా గ్రహించుకున్న పవన్‌ని అభినందించాలి. ఉండవల్లి, పద్మనాభయ్య, జెపిలు పవన్‌తో జత కట్టిన తర్వాతే పవన్‌కి టిడిపిపై ఉన్న భ్రమలు కూడా వీడుతున్నాయి. ఆల్‌రెడీ ఏనాడో బిజెపి బుద్ది బహిరంగమైంది. ఇప్పుడు టిడిపి రంగు కూడా బయటపడింది.
దీంతో కిందటి ఎన్నికల్లో తాను బిజెపి, టిడిపిలకు మద్దతు ఇచ్చి తప్పు చేశాననే భావం పవన్‌లో కనిపిస్తూ ఉంది. టిడిపి, బిజెపిలు కిందటి ఎన్నికల్లో తనని వాడుకుని, చిన్న పిల్లాడిలా చూస్తున్నట్లు ఉన్నాయని, వారు తనని వాడుకుని వదిలేశారని పవన్ బహిరంగంగానే చెప్పారు. తనపై ఐటి అధికారులను కూడా పురిగొల్పారని, బాధ్యతాయుతంగా మెలగాల్సిందిపోయి చిల్లరగా ప్రవర్తిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశాడు. కేంద్రంతో గొడవలు వద్దని ఎందుకు టిడిపి భావిస్తోంది? దానికి కారణం ఏమిటి? కేంద్ర మంత్రులు ఇప్పుడు రాజీనామా చేసినందువల్ల ఏమి ప్రయోజనం కలుగుతుంది? అంటూ దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని తేల్చిచెప్పాడు. కేవలం కేసుల వల్లే టిడిపి, వైసీపీిలు భయపడుతున్నాయని ఆయన మొదటి సారిగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుజ్జర్లు, తెలంగాణ ఉద్యమం రీతిలో ఏపీలో ప్రత్యేకహోదా ఉద్యమం తీవ్రం కావాలని, ఉద్యమాన్ని పార్టీలు నడపడం కాదు.. ప్రజలే ముందుకు వచ్చి నడపాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ ఉద్యమం దీర్ఘకాలం సాగి ఫలితాలను సాధించలేదని ఆయన తెలిపాడు.
హోదా కోసం ప్రత్యేక జేఏసీ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని, 2019లో తన స్టాండ్ ఏమిటో త్వరలో చెబుతాను అన్నాడు. మూడో కూటమి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఏపీ కోసం అందరు కలిసి రావాల్సిన అవసరం ఉంది. దక్షిణాది ఉద్యమం తొండ ముదిరి ఊసరవెల్లిలా మారుతోంది. గుంటూరు సభలో అన్ని విషయాలు చెబుతానని, మార్చి 14న జరిగే సమావేశంలో అన్ని ప్రశ్నలకు జవాబు చెబుతానన్నాడు. మొత్తానికి రాజకీయ తత్వాన్ని పవన్ తొందరగానే ఒంటపట్టించుకుని అన్నని మించిన తమ్ముడుగా పేరు తెచ్చుకుంటున్నాడు. ఇక ఈయన టిడిపి, వైసీపీలకు సమాన దూరం పాటించి, వామపక్షాలు, లోక్‌సత్తా వంటి వాటి సాయంతో ఒంటరిపోరుకే సై అనే అవకాశం ఉంది. మరోవైపు ఏపీ ప్రజల్లో కాంగ్రెస్‌పై కాస్త మెతక ధోరణి కనిపిస్తోంది. ఏ విషయంలో తీసుకున్నా బిజెపి కంటే కాంగ్రెసే బెటరని, ఆ పార్టీ వస్తే ప్రత్యేకహోదా ఇస్తుందనే ఆశ చిగురిస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్‌ని నడిపే బాధ్యత చిరుకి ఇస్తే ఎలా ఉంటుంది? అనే చర్చ సాగుతోంది.
అయితే కాంగ్రెస్ రాష్ట్రంలో బలపడితే వైసీపీకే నష్టమని, వైసీపీలో ఉన్నదంతా కాంగ్రెస్ వారే కావడంతో వారు సొంత గూటికి చేరితే కాంగ్రెస్ పుణ్యాన వైసీపీ ఓట్లు చీలి, టిడిపి బాబుకే లబ్దిచేకూరుతుందని అంటున్నారు. ఇక ఏదో శశికళ వంటి వారి మీద వారి బంధువుల మీద ఐటి దాడులు చేస్తే పట్టించుకునే వారు ఉండకపోవచ్చు గానీ పవన్, రజనీకాంత్ వంటి వారిపై ఇలా ప్రతీకార చర్యలు తీసుకుంటే తమ సమాధిని బిజెపి తానే తవ్వుకున్నట్లు అని చెప్పాలి.