కిందటి ఎన్నికల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించడం, సమన్యాయం చేయకపోవడం, స్వయాన ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియా చేతిలో కీలుబొమ్మ కావడంతో గుజరాత్‌ని అభివృద్ది పధంలో పయనించేలా చేసిన మోదీని ప్రధానిని చేయాలని పవన్‌కళ్యాణ్ మాత్రమే కాదు.. ఆయనను కలసి మద్దతు ఇచ్చిన వారిలో మంచు ఫ్యామిలీ, నాగార్జున నుంచి శివాజీ వరకు ఎందరో ఉన్నారు. కానీ వారి ఆశలు కేవలం నాలుగేళ్లలోనే వమ్ము అయిపోయాయి. ఇక విడిపోయిన తెలంగాణ రాష్ట్రం కూడా ఏపీకి హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాని ఇవ్వాలని, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వడం లేదో కుండబద్దలు కొట్టాలని చెప్పి స్వయాన తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావేరి కోసం తమిళనాడు, కర్ణాటక కొట్టుకోవాలి. ఇక కృష్ణ కోసం ఏపీ, తెలంగాణ కొట్టుకోవాలి? అనే విధంగా కేంద్రం వైఖరి ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక కిందటి ఎన్నికల్లో మోదీకి సపోర్ట్ చేసిన పవన్, శివాజీ, మోహన్‌బాబులు ప్రస్తుతం భ్రమలోంచి వాస్తవాలలోకి వచ్చారు.
ఇక మోహన్‌బాబు విషయానికి వస్తే ఈయనకు కోపం... కోపం వస్తే ఎవరు అని చూడకుండా బూతులు, కొట్టడం వంటివి చేస్తాడనే చెడ్డపేరు ఉంది. ఇక తనను తానే పొగుడుకుంటాడని, తన పిల్లలను, తనని తాను పొగుడుకునే స్వోత్కర్ష ఈయనలోని చెడ్డగుణం. ఆవేశపరుడైనా గానీ కొన్ని విషయాలలో గట్టిగానే మాట్లాడుతాడు. 99శాతం మంది పొలిటిషియన్స్ రాస్కెల్స్ అన్నాడు. తాజాగా ఆయన ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వని కేంద్రంపై, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్ధిక మంత్రి వ్యవహారశైలిని ఆయన తప్పుపట్టారు. 'ఏపీపై సవతి ప్రేమను ఎందుకు చూపిస్తున్నారు? ఏపీ చేసిన అన్యాయం ఏమిటి? ప్రత్యేకహోదా విషయంలో ఏమి జరుగుతోంది? తెలంగాణ కూడా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరుకుంటోంది. మీరు మాత్రం హోదా ఓ రాష్ట్ర సెంటిమెంట్ అని దానిని ఏపీ సెంటిమెంట్‌గా కొట్టిపారేస్తారా'? అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డాడు.
ఇక మోహన్‌బాబు త్వరలోనే ప్రత్యక్ష్య రాజకీయాలలోకి రానున్నాడు. 'గాయత్రి'లో టిడిపిని టార్గెట్ చేయడం, ఇప్పుడు బిజెపిని టార్గెట్ చేయడం చూస్తే ఆయన చేతిలో రెండు పార్టీలే ఆప్షన్‌గా ఉన్నాయి. ఒకటి వైసీపీ.. రెండు కాంగ్రెస్. కాంగ్రెస్‌లో చిరు ఉన్నాడు కాబట్టి ఎన్టీఆర్ హయాంలో రాజ్యసభ ఎంపీగా పనిచేసిన మోహన్‌బాబు ఈసారి వైసీపీకి మద్దతు ఇవ్వనున్నాడని సమాచారం. కాస్త పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా మోహన్‌బాబు నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సివుంది....!