బతికి ఉన్న వారిని చంపడం, లేదా చనిపోయిన వారి మరణాలను తామంతట తామే క్రైమ్ థ్రిల్లర్‌ని మరిపించేలా కథనాలు వండి వార్చడంలో మీడియా ముందుంటోంది. మరీ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్‌మీడియా ఎక్కువయ్యే సరికి ఈ ధోరణి బాగా పెరిగింది. నాడు ప్రింట్ మీడియా ఒక్కటే ఉండటంతో తెల్లవారి వచ్చే పత్రికకు కాస్త సమయం ఉండేది. దాంతో ఆయా వార్తలను మీడియా వారు వారి బంధువులు, సన్నిహితులు, ఇతరుల ద్వారా క్రాస్ ఎగ్జామ్ చేసుకుని ప్రచురించేవారు.
కానీ ఇప్పుడు టీవీ చానెల్స్, సోషల్‌మీడియాలో అందరికంటే తామే బ్రేకింగ్ న్యూస్‌ని ముందుగా ఇవ్వాలనే ఆతృతతో ఇలా బతికున్నవారిని కూడా చంపేస్తున్నారు. ఒక నిజమైన బ్రేకింగ్ న్యూస్‌ని ముందుగా ఇస్తే వచ్చే క్రెడిబులిటీ కంటే కాస్త ఆలస్యంగానైనా సరైన వార్తను అందిస్తే వచ్చే నమ్మకం, గుడ్ విల్ ఎంతో బాగా ఉంటాయి. ఈ కారణం వల్లనే ఈటీవీలో రాత్రి 9 గంటలకు వచ్చే న్యూస్ అంటే జనాలకు అంత ఆసక్తి. కారణం అందులో అన్ని వాస్తవాలే ఉంటాయి గానీ హడావుడిగా చెప్పేన్యూస్‌లు ఉండవు.
ఇక తాజాగా మన మీడియా పవన్‌కళ్యాణ్ అత్తగారిని కూడా చంపేసి సంతాపం ప్రకటించి చేతులు దులుపుకుంది. పవన్ మూడో భార్య అన్నా లెజినోవా తల్లి మరణించిందని, దీని వల్ల పవన్ తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని తన భార్యకి బాసటగా నిలుస్తున్నాడని, రేణుదేశాయ్ కూడా పవన్‌కి, అన్నాలెజినోవాకి సానుభూతి తెలిపినట్లు సోషల్‌మీడియా అంతటా హడావుడి కనిపించింది. పనిలో పనిగా యూట్యూబ్ చానెల్స్ కూడా దీనిపై 'పులిహోర' వార్తలను అల్లారు.
కానీ పవన్ తన తాజా రాజకీయ కార్యచరణపై మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఇక సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలను పవన్ ప్రతినిధి ఖండించారు. అన్నాలెజినోవా తల్లి ఆరోగ్యంగా ఉందని, ఆమె మరణ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, దయజేసి ఇలాంటి అసత్యప్రచారాలను, వార్తలను ప్రసారం చేయవద్దని పవన్ మీడియా ప్రతినిధి మీడియాను కోరారు.