సినిమా వారు తమ కెరీర్‌ని అద్భుతంగా సాగించి, బాగా ఆర్దికంగా స్ధిరపడిన తర్వాత, ఇక సినిమాలలో నటించే వయసు దాటిపోవడం, రిటైర్‌మెంట్ స్టేజీ వచ్చిందని తెలిసిన తర్వాత వారికి ప్రత్యామ్నాయంగా రాజకీయాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఓ రాజకీయ పార్టీని స్థాపించడం, రాజకీయాలలో రాణించడం అనేది సినిమా అంత ఈజీ కాదు. సినిమాలలో స్టార్స్ మాటకు తిరుగుండదు. పారితోషికం నుంచి ట్రీట్‌మెంట్ దాకా రాచమర్యాదలు ఉంటాయి. కానీ రాజకీయాలలో అది ఉండదు. ఎండనక వాననక పలువురు వ్యక్తులను కలుసుకుంటూ, సమావేశాలు, సభలు వంటి వాటిని నిర్వహిస్తూ ఉండాలి. అలా చేయాలంటే తమ జేబులోని డబ్బులను ఖర్చుపెట్టలేరు. ఇక దీంతో వీరు కూడా పార్టీ విరాళాలు, ఎమ్మెల్యే టిక్కెట్ల అమ్మకం వంటివి చేస్తూ బండిలాగిస్తుంటారు. ఈ విషయంలో విజయ్‌కాంత్ ఒక్కడే కష్ట నష్టాలకు అతీతంగా వ్యవహరిస్తున్నాడు. కానీ కార్తిక్, శరత్‌కుమార్ నుంచి చిరంజీవి వరకు తమ పార్టీలను ఇతర పార్టీలలో కలిపేసిన వారే. ముఖ్యంగా ఈ విషయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం నాడు సంచలనం సృష్టించింది. ఆయన కొంత కాలం.. అంటే ఇప్పటివరకు తన పార్టీని నడిపి ఉంటే, చంద్రబాబుపై వ్యతిరేకత, జగన్‌పై నమ్మకం లేకపోవడం వంటి పరిస్థితుల్లో చిరు ప్రత్యామ్నాయంగా కనిపించేవాడు.
కానీ ఆయన అంతగా సహనం చూపలేకపోయాడు. ఇక ఇటీవల కర్ణాటకలో సినీస్టార్ ఉపేంద్ర కొత్త పార్టీని పెట్టాడు. కార్మికుల రంగు అయిన ఖాకీని తన రంగుగా ఎంచుకుని పవన్ సిద్దాంతాల ఆధారంగానే తాను రాజకీయాలలోకి వచ్చానని, కేవలం ఇంకా పూర్తి రాజకీయాలలోకి ఎంటర్ కాకుండానే, ఒక్క ఎమ్మెల్యే లేకుండానే పవన్ ఎన్నో సమస్యలని పరిష్కరిస్తున్నాడంటూ ప్రశంసించాడు. కానీ ఈయన పార్టీ పెట్టి మూణాళ్లు కాలేదు. త్వరలో కర్ణాటకలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా పార్టీని నడపలేనని తెలుసుకున్న ఉపేంద్ర తన పార్టీని బిజెపిలో విలీనం చేయాలని భావిస్తున్నాడట. పార్టీకి సంబంధించిన వ్యవహారాలలో మౌనంగా ఉంటున్న ఆయన వైఖరి పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన నియంతలా వ్యవహరిస్తున్నాడని కొందరు మండిపడుతున్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ, ఉపేంద్ర సినిమాలలో పెద్ద నటుడైతే కావచ్చు.
కానీ పార్టీలో ఆయన నియంతలా బిహేవ్ చేస్తున్నాడు. రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నా ఆయన పార్టీని పట్టించుకోవడం లేదు. దీంతో పార్టీలోని అందరు అసంతృప్తితో ఉన్నారని తెలిపాడు. ఇక పార్టీని మూసివేస్తారనే ఉదంతులను ఉపేంద్ర ప్రతినిధి ఆనంద్ ఖండించాడు. గిట్టని వారు ఈ ప్రచారం చేస్తున్నారని, మార్పు అనేది రాత్రికి రాత్రి రాదు అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని మనవి చేశాడు. మరి ఉపేంద్ర ఏ నిర్ణయం తీసుకుంటాడో వేచిచూడాల్సివుంది. గెలుపు ఓటములకు అతీతంగా పవన్‌లా ఉంటాడా? ఆయన అన్నయ్య చిరంజీవిలా తొందరపడతాడా? అనేది చూడాలి...! మొత్తానికి సినిమావారు ఏదో ఒక పార్టీలో చేరి గెలవడం వరకు ఓకే గానీ పార్టీలు స్థాపించి, సుదర్ఘ రాజకీయం చేయలేరని అర్ధమవుతోంది.