కొన్ని సినిమాలలో చిన్న వేషాలు, టివీ సిరియల్స్‌లో నటించిన నిఖిల్‌కి 'హ్యాపీడేస్' పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆయన నటించిన 'యువత' చిత్రం కూడా బాగానే మెప్పించింది. కానీ ఈయనకు మంచి బ్రేక్‌నిచ్చిన చిత్రం మాత్రం 'స్వామి రారా'. దీని తర్వాత 'కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ' చిత్రాలలో బిజీగా ఉన్నాడు. ఇక ఈయన ప్రస్తుతం కన్నడలో చిన్నచిత్రంగా విడుదలైన బ్లాక్‌బస్టర్ కొట్టిన 'కిర్రాక్‌పార్టీ'ని అదే పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఈనెల 16వ తేదీన విడుదల కానుంది. దీని తర్వాత కూడా ఆయన తమిళ 'కణితన్' చిత్రాన్నిరీమేక్ చేస్తున్నాడు. తెలుగులోనే వైవిధ్య భరితమైన చిత్రాలను ఎంచుకునే ఆయన ఇలా వరుసగా రెండు రీమేక్ చిత్రాలు చేస్తూ ఉండటం కాస్త ఆశ్చర్యకరమే. ఇక 'కిర్రాక్‌పార్టీ'ని అదే పేరుతో రీమేక్ చేస్తూ శరణ్ కొప్పిశెట్టి అనే దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు.
ఇక ఈ చిత్రానికి సుధీర్‌వర్మ స్క్రీన్‌ప్లేని, చందుమొండేటి మాటలను అందిస్తున్నారు. కన్నడలో ఈ చిత్రానికి సంగీతం అందించిన అంజనీష్ లోక్‌నాథే తెలుగులో కూడా సంగీతం అందించమే కాదు.. అందులోని ట్యూన్స్‌ని కూడా మక్కీకి మక్కీ దింపుతున్నాడు. 'లాస్ట్‌బెంచ్' అనే పాటను అలాగే దించేయడమే కాదు ఈ పాటను కన్నడలో పాడిన సింగర్ చేతనే పాడించారు. ఇక ఇందులో సంయుక్తా హెగ్డే, సిమ్రాన్ పర్జీనాలు హీరోయిన్లుగా నటిస్తుండగా, ఎకె ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందింది. ఇక ఈ చిత్రం గురించి నిఖిల్ మాట్లాడుతూ, హ్యాపీడేస్ తర్వాత తాను చేస్తున్న పూర్తి కాలేజీ స్టోరీ ఇది అని తెలిపాడు. ఇది నా 15వ సినిమా. ఇందులో నేను స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నాను. నేను ఇప్పటి వరకు చేసిన చిత్రాలలో ఈ పాత్రే ది బెస్ట్‌గా నిలుస్తుందని చెప్పగలను. ఇది యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. వారికి సందేశం ఇచ్చేలా ఉంటుంది.
ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు, దర్శకుడికి అభిప్రాయ బేధాలు వచ్చిన మాట నిజం కాదని, అది పుకారని తోసిపుచ్చాడు. ఇక ఈ చిత్రంలోని పాటలనే మక్కీకి మక్కీగా దింపారా? లేక కథను కూడా మన నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేయకుండా యాజిటీజ్‌గా దించేశారా? అన్నది వేచిచూడాల్సివుంది.