దర్శకునిగా కోడిరామకృష్ణ వెర్సటైల్ డైరెక్టర్. ఇటు చిన్న చిత్రాలు, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, మెసేజ్ ఓరియంటెడ్, యాక్షన్ , లేడీ ఓరియంటెడ్, కథా బలమున్న చిత్రాలే కాదు... స్టార్ హీరోలకు చిత్రాలకు, భారీ బడ్జెట్ చిత్రాలకు కూడా ఆయన పనిచేశారు. నిన్నటి తరంలో ఆయన లెజెండ్. ముఖ్యంగా కొత్త నిర్మాతలు తమ మొదటి చిత్రాలను ఆయనతోనే తీయాలని భావిస్తారు. కెరీర్ మొదట్లో చిరంజీవి నుంచి అర్జున్, రాజశేఖర్ వరకు ఈయన ఎందరికో బ్లాక్‌బస్టర్స్ ఇచ్చారు. ఇక ఈయన మెగాస్టార్ చిరంజీవితో నాడు హైయ్యస్ట్ బడ్జెట్‌తో తీసిన 'అంజి' చిత్రం మెగాస్టార్ కెరీర్‌లో ఎక్కువ కాలం పనిచేసిన చిత్రంగా ఐదేళ్లు షూటింగ్ జరుపుకుంది.
మొదట ఈ కథను నిర్మాత ఎమ్మెస్‌రెడ్డి తనయుడు శ్యాంప్రసాద్‌రెడ్డి వెంకటేష్‌తో తీయాలని భావించాడు. అన్ని ఓకే అనుకున్న సమయంలో అల్లుఅరవింద్ ఈ చిత్రాన్ని చిరంజీవితో చేయాలని, తాను అతని కాల్షీట్స్ అడ్జస్ట్ చేస్తానని చెప్పడం, శ్యాంప్రసాద్‌రెడ్డి కూడా ఓకే అనడం, ఈ చిత్రంలోని పాత్ర కోసం ఎంతో సమయం కేటాయించిన వెంకటేష్ బాధపడటం జరిగాయి. ఇక 'అంజి' గురించి కోడిరామకృష్ణ మాట్లాడుతూ, చిరంజీవితో ఓ గ్రాఫిక్స్‌తో నిండిన చిత్రాన్ని తీయాలని నాకు శ్యాంప్రసాద్‌రెడ్డి చెప్పాడు. నేను చిరంజీవిని కలిసి సార్ గ్రాఫిక్స్ సినిమా అంటే కొత్త ఆర్టిస్టులాగా కష్టపడాల్సి వస్తుందని చెప్పాను. చిరంజీవి నో ప్రాబ్లమ్. కష్టపడటానికి నేను రెడీ. గ్రాఫిక్స్ చిత్రమే చేద్దామని అన్నారు ఈ చిత్రంలోని ఇంటర్వెల్ సీన్స్‌ని నెలరోజుల తీశాం. చిరుగారు ఎంతో ఓపికగా చేశారు. సహకరించారు. నిర్మాత కూడా భారీగా ఖర్చుపెట్టినా చిత్రం ఐదేళ్ల తర్వాత విడుదలైంది.
క్లైమాక్స్ సీన్స్‌ల కోసం చిరంజీవి ఒకే రంగు బట్టలు రెండేళ్లు ధరించారు. గ్రాఫిక్స్‌కి ఇబ్బంది రాకూడదని ఆయన ఆ విధంగా సహకరించారు. ముందుగా చెప్పినట్లు ఓ కొత్త ఆర్టిస్ట్‌లానే కష్టపడ్డాడు. ఇంత పెద్ద చిత్రాన్ని ఓ కొత్త హీరోయిన్‌తో చిరంజీవి చేయడం విశేషం. ఆ సినిమా పూర్తి కావడానికి చిరంజీవి గారే కారణం అని చెప్పుకొచ్చారు. కానీ బాలయ్య 'లక్ష్మీనరసింహ'కి పోటీగా సంక్రాంతికి వచ్చిన 'అంజి' ఫ్లాప్‌కాగా, 'లక్ష్మీనరసింహ' విజయం సాధించడం విశేషం.