మోహన్‌బాబు చెప్పినట్లు అందరు కాకపోయినా రాజకీయ పార్టీలు, నాయకులలో 99శాతం మంది, 99 శాతం పార్టీలు రాస్కెల్స్‌గా బిహేవ్ చేస్తున్నాయి. పార్లమెంట్‌లో వాగ్దానం చేసిన వాటికే దిక్కులేదంటే ఇక మన ప్రజాస్వామ్యంలో ఎవరి మాటకు విలువ ఉందో అర్ధం కాని పరిస్థితి. స్వయాన నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ హామీలను, 10ఏళ్లు కాదు.. 15ఏళ్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పట్టుబట్టిన బిజెపినే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటకు కట్టుబడి లేదు. ఇక ఏపీ విషయంలో కాంగ్రెస్, బిజెపి, టిడిపిలు దోషులుగా కనిపిస్తున్నాయి. ఇక వైసీపీ ఏమీ మినహాయింపు కాదు. వారు వచ్చే ఎన్నికల్లో బిజెపితో దోస్తీకి తహతహలాడుతున్నారు. ప్రత్యేకహోదా కేంద్రం ఇవ్వాల్సిన విషయం అయినా వారు కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పని చేయరు. కేవలం మన రాష్ట్రంలో ధర్నాలు, నిరసనలు చేస్తే మనకే ఇబ్బంది తప్ప కేంద్రం ఎందుకు స్పందిస్తుంది? అనేది అర్ధం కాని విషయం. ఇదే పరిస్థితి తమిళనాడు వంటి రాష్ట్రాలకు ఏర్పడి ఉంటే పార్టీల కతీతంగా రాష్ట్రం భగ్గుమనేది. వారు తమ రాష్ట్రానికి చెందిన బస్సులపై ప్రతాపం చూపించరు. కేంద్రం కిందకి వచ్చే సంస్థలు, రైల్వే వంటి వాటినే టార్గెట్ చేస్తారు.
కానీ మన రాష్ట్రంలో మాత్రం మన బస్సులను, మన ఆస్తులను మనం నాశనం చేసుకుంటాం తప్పితే కేంద్రం జోలికి పోము. ఇక అవినీతి కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయిన జగన్‌కి రాష్ట్రపతి కాకముందే రామ్‌నాధ్ కోవింద్‌కి సాష్టాంగ ప్రమాణం చేసే పరిస్థితి. ఇలా దేశంలో, రాష్ట్రంలో అన్ని పార్టీలు దొంగలుగానే మారాయి. ఇక ఇది ఇలా ఉంటే మరి వచ్చే ఎన్నికల్లో అసలు ఓటు ఎవరికి వేయాలి? అసలు వేయాల్సిన అవసరం ఉందా? అనేంతగా పరిస్థితి ఉంది. ఉన్న దొంగల్లో కొంచెం మేలైన దొంగలను ఎంచుకోవాల్సిన దుస్థితి. ప్రత్యేకహోదా విషయంలో బిజెపి, టిడిపి, కాంగ్రెస్, వైసీపీ అన్ని ప్రజలను రెచ్చగొట్టి ఓటు బ్యాంకు కోసం ప్రయత్నిస్తున్నాయి తప్పితే ఎవరిలో నిజాయితీ కనిపించడం లేదు. ఇక పవన్ ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, నిధులు ఇస్తున్నామని కేంద్రం చెబుతోన్న మాటల్లో నిజమెంత? ఏమీ ఇవ్వలేదు? అని ఎన్నికలు మరో ఏడాదిలోపు ఉన్న సమయంలో చెప్పడంలో నిజమెంత అనే విషయంపై జెఎఫ్‌సి వేశాడు. ఈ కమిటీలోని పద్మనాభయ్య, జయప్రకాష్ నారాయణ్‌లు కేంద్రాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు.
ఇక ఇందులో టిడిపి పాపం కూడా ఉంది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా పరిస్థితి దిగజారింది. అసలు కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్ట్‌ని రాష్ట్రం తన ఆధీనంలోకి తీసుకోవడం వెనుక ఎంతో మతలబు ఉంది. తమ పార్టీకి విరాళాలు, తమ పచ్చచొక్కా వారికి కాంట్రాక్ట్ దక్కించుకునేందుకే టిడిపి ఈ పని చేసింది. ఇక అమరావతి డిజైన్లు చూపించడం, లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని టిడిపి చేస్తున్న మాట నిజమే అయితే ఇప్పటి వరకు దాని పురోగతి ఎక్కడ వరకు వచ్చింది? ఎన్నేళ్లలో ఉద్యోగాలు వస్తాయి? బాబు వస్తే జాబు వస్తుందనే విషయంలో ఇప్పటి వరకు జరిగిన పురోగతి ఏమిటి? అన్న ప్రశ్న ఉదయించకమానదు. ఇక పవన్ వేసిన కమిటీలోని వారు కేంద్రాన్ని పూర్తిగా తప్పుపడితే పవన్ ఏకంగా టీడీపికి కూడా లెఫ్ట్ రైట్ ఇచ్చాడు. ఎంతో అనుభవం ఉందని బిజెపి, టిడిపిలకు మద్దతు పలికితే ప్రత్యేకహోదానా,? ప్రత్యేకప్యాకేజీనా? అని తేల్చుకోలేకపోయిన బాబు అనుభవం ఏమైందని ప్రశ్నించాడు. ఇది అక్షరసత్యం. ఇక ఒకప్పుడు చంద్రబాబు పరిపాలన బాగా ఉండేది. తాను తినడు.. ఇతరులను తిననివ్వడని ఆయనకు మంచి పేరుండేది. కానీ నేడు మాత్రం ఆయన కూడా వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఏమాత్రం తక్కువ కాదని, జగన్ కంటే లోకేష్ ఏమీ తక్కువ తినలేదని నిరూపిస్తున్నారు. ఎంత సేపటికి కేంద్రంతో గొడవ పడలేం అంటాడు. అంటే రాష్ట్రాలు కేంద్రాలను అడుక్కోవాలా? మనది సమైక్య దేశం.
ఇందులో కేంద్రానికి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా చేయాల్సిన సాయం, ఇవ్వాల్సిన నిధులు ఖచ్చితంగా ఇవ్వాలి. దానికి కూడా దేహీ అనడం ఏమిటి? మమతాబెనర్జీ, కేజ్రీవాల్‌లకి, చివరకు ముందుగా తృతీయఫ్రంట్ గురించి ఓపెన్‌గా కేంద్రానికి భయపడకుండా మాట్లాడిన కేసీఆర్‌ను మనం చూస్తుంటే చంద్రబాబు మాత్రం మౌనం వహిస్తూ, కేంద్రానికి కోపం రాకుండా మెతకగా ఉన్నాడు. ఆయనలోని డేరింగ్ సీఎం ఏమయ్యాడనేది బాధపడాల్సిందే. మొత్తంగా పవన్ వేసిన కమిటీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను రెండింటిని దోషిగా చూపిస్తుండటం చూస్తే దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నారని అనిపించకమానదు. మొత్తానికి ఈ మాత్రం ప్రయత్నం చేసిన పవన్‌ని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాలి.