మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ మొదటి మూడు నాలుగు చిత్రాలతో మాస్ హీరోగా, హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఆయన చేసిన చిత్రాలు బాక్స్‌లు తిరుగుటపాలో వచ్చేశాయి. తాజాగా వినాయక్ వంటి దర్శకుడు తేజుతో చేసిన 'ఇంటెలిజెంట్' చతికిల పడింది. దాంతో ప్రస్తుతం తేజు సీనియర్ నిర్మాత కె.యస్.రామారావు నిర్మాతగా కరుణాకరన్ దర్శకత్వంలో ఓ ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం మొత్తం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చుట్టూనే తిరుగుతుందని, ఇందులో తేజు క్యారెక్టర్ మీదనే సినిమా నడవదని తెలుస్తోంది. ఇక తన బాబాయ్ పవన్‌కి 'తొలి ప్రేమ' వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడు కావడం, మెగా ఫ్యామిలీకి కె.ఎస్.రామారావు ఆప్తుడు కావడం, మరోవైపు మొదటి నుంచి పవన్ తేజు కెరీర్‌ని బాగా పరిశీలిస్తుండటంతో ఈ చిత్రం ప్రమోషన్స్‌లో పవన్‌ని బాగా వాడుకోవాలని తేజు ప్లాన్స్ రచిస్తున్నాడు.
అందులో భాగంగా ఆయన్ను ఎలాగైనా ఆడియో వేడుకకు ముఖ్యఅతిథిగా తేవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ ఇప్పుడు పవన్ దృష్టి మొత్తం పాలిటిక్స్ మీదనే ఉంది. ఇక తేజు ఆడియోకి వచ్చి వరుణ్‌తేజ్ వంటి ఆడియోలకు రాకపోతే బాగోదు. ఈ ఉద్దేశ్యంతో పవన్ వస్తాడని తేజు నమ్మకంగా ఉన్నా కొందరు ఇది జరిగే పనికాదు అంటున్నారు. ఇక పవన్ కాదు మహేష్ అయినా సరే ప్రమోషన్స్ చేసినంత మాత్రాన మొదటి రోజు కలెక్షన్లు మాత్రమే వస్తాయి. ఆ తర్వాత అంతా సినిమా కంటెంట్‌పై ఆధారపడి ఉంటుంది. బాగా లేకపోతే ప్రేక్షకులు పవన్, మహేష్‌ల చిత్రాలే చూడటం లేదు. ఇక మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చి, ప్రమోషన్ చేసిన తన సోదరి 'మనసుకు నచ్చింది' పరిస్థితి అందరికీ తెలిసిందే.
ఇక పవన్ ప్రమోట్ చేసిన 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్'లే కాదు 'అజ్ఞాతవాసి, సర్దార్‌గబ్బర్‌సింగ్, బ్రహ్మూెత్సవం, స్పైడర్'ల ఫలితాలు అందరి కళ్ల ముందు తిరుగుతున్న నేపధ్యంలో మెగా ఫ్యాన్స్ ఎలాగూ తేజూ సినిమాకి మొదటి రోజు కలెక్షన్లు తెచ్చిపెడతారు... మిగిలినదంతా కంటెంట్‌లోనే ఉంది అన్న విషయం తేజుకి ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో...!