అతిలోకసుందరి ఓ పరిపూర్ణమైన నటే కాదు.. అంతకు మించి మంచి మనసున్న వ్యక్తి. ఉత్తమ భార్య, ఉత్తమ తల్లికి నిదర్శనం. ఇక ఈమె పెద్దకుమార్తె జాన్విని హీరోయిన్‌ని చేసేందుకు బోనీకపూర్ కంటే శ్రీదేవే ఎక్కువగా కృషి చేసింది. చివరకు మరాఠి చిత్రం 'సైరత్'కి రీమేక్‌గా బాలీవుడ్‌లో రూపొందుతున్న 'దఢక్' చిత్రం ద్వారా హీరోయిన్ అవుతోంది. ఈ చిత్రం జులైలో విడుదల కానుంది. ఇక ఈమె తాజాగా తన తల్లిని వర్ణిస్తూ రాసిన లేఖ ఎంతో హృద్యంగా ఉంది. తన 21వ జన్మదినం సందర్భంగా ఆమె తల్లిదండ్రులను ప్రేమించండి అని యువతకి సందేశం ఇచ్చింది.
ఈ లేఖలో ఆమె మాట్లాడుతూ, 'అమ్మా.. నువ్వు మాతో లేకపోయినా నీ మధురానుభూతులను పొందుతూనే ఉన్నాం. బాధ, విచారం నుంచి ఇప్పటికీ నువ్వు నన్ను కాపాడుతూనే ఉన్నట్లు ఉంది. కళ్లు మూసిని, తెరచినా నీవే కనిపిస్తున్నావు. మంచి విషయాలే నాకు జ్ఞప్తికి వస్తున్నాయి. మా జీవితాలకు నువ్వో వరం...నీవు ఎంతో మంచి దానివి, అతి స్వచ్చమైన దానివి. అత్యంత ప్రేమమూర్తివి. అందుకేనేమో ఆ దేవుడు నిన్ను ఇంత త్వరగా తనవద్దకు తీసుకుని వెళ్లాడు. నాకు ఎల్లప్పుడు కావాల్సింది నీవే... నువ్వు నా ఆత్మలో భాగం. నువ్వు నా బెస్ట్‌ఫ్రెండ్‌వి. నీ జీవితం అంతా ఇవ్వడమే చేశావు. అదే విధంగా నేను నిన్ను సంతోష పెట్టాలని భావిస్తున్నాను. నువ్వు గర్వపడేలా ఎదగాలనుకుంటున్నాను. నిన్ను చూసి మేము గర్వపడినట్లుగా, ఏదో ఒకరోజు నువ్వు నన్ను చూసి గర్వించేలా చేయాలనుకుంటున్నాను. అందుకోసం ప్రతిక్షణం కష్టపడతాను. అదే ఆలోచనతోనే నేను ప్రతి రోజు ఉదయం లేస్తానని ఒట్టేసి చెబుతున్నా...ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉన్నట్లుగా నాకు ఉంది..నువ్వు నాలోనూ, ఖుషీలోనూ. పాపా బోనీకపూర్‌లోనూ ఉన్నావు. నువ్వు మాపై వేసిన ముద్ర చాలా బలమైంది. మేము ముందుకు సాగడానికి అది చాలు.. అంటూ ఎంతో అద్భుతంగా, ఉద్వేగంగా లేఖ రాసింది.