కిందటి ఎన్నికల్లో అనుభవం ఉందని, కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిన తీరు తాను జనసేన పార్టీని స్థాపించడానికి కారణమని, అనుభవం కారణంగానే రాష్ట్రానికి మేలు జరుగుతుందని టిడిపి, బిజెపిలకు మద్దతు ఇచ్చానని పవన్ పేర్కొన్నాడు. ఇక తాజాగా ఆయన ఆ విషయాన్ని మరోసారి ప్రస్తావిస్తూ గతంలో ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని బిజెపి అంటే పాచిపోయిన రెండు లడ్డులు ఇస్తామన్నారని తాను విమర్శించానని, కానీ నాడు చంద్రబాబు మేము పాచిపోయిన లడ్డూలనైనా తీసుకుంటామని అన్నాడని పవన్ గుర్తు చేశాడు. ఇక ఏపీ విషయంలో నిజంగా కేంద్రం ఎంత ఆర్దిక సాయం చేస్తోంది అని అందరికీ తెలిసేలా చేసేందుకే నేను కమిటీ వేశాను. ఇందులో కేంద్రం పాచిపోయిన లడ్డులు కాదు కదా..! వేటిని ఇవ్వలేదని ఆయన కేంద్రంపై మండిపడ్డారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని, దానిని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఖర్చు పెరిగినా కేంద్రమే భరించాలి. పార్లమెంట్‌లో చేసిన వాగ్దానాలనే అమలు చేయడం లేదంటే ఇంకేం నమ్మగలం? ఒకసారి ప్రత్యేక హోదా కావాలని, మరోసారి ప్రత్యేక ప్యాకేజీ కావాలని టిడిపి, బిజెపిలు ఎందుకు కన్‌ఫ్యూజన్ సృష్టిస్తున్నాయి? ఏపీలోని 11 జాతీయ విద్యాసంస్థల కోసం నామమాత్రపు నిధులిచ్చారని, వారు ఇచ్చింది కేవలం 5 శాతమేనని పవన్ పేర్కొన్నాడు.
అలాగే విశాఖ రైల్వే జోన్ విషయంలో కూడా కేంద్రం తాత్సారం చేస్తోంది. ఏది అడిగినా చేయలేమని అంటున్నారు. మరి ఇంతకీ వారు ఏమి చేయగలరో ప్రజలకు వివరించగలరా? ప్రజలను ఆందోళనకు, అయోమయానికి గురి చేయవద్దని పవన్ ఘాటుగా హెచ్చరించారు. ప్రత్యేక హోదా ఇస్తేనే ఏపీకి 100 శాతం న్యాయం జరుగుతుందని కమిటీ స్పష్టం చేసింది... అంటూ పవన్ బిజెపి, టిడిపిలపై మండిపడ్డారు. ఇక పవన్ వచ్చే ఎన్నికల్లో టిడిపి, వైసీపీలతో కూడా జత కట్టే ఉద్దేశ్యం లేదని, ఆప్ స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో లోక్‌సత్తా, వామపక్షాల సాయంతో పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక తప్పు చేసిన వాడే భయపడతాడు. వంగి వంగి సలామ్‌లు కొడతాడు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతి చేస్తోందని కాంగ్రెస్, బిజెపిలు మండిపడుతున్నాయి. కానీ కేసీఆర్ ఎంతో డేర్‌గా ముందడుగు వేసి తృతీయ ప్రత్యామ్నాయంపై మాట్లాడారు. కానీ చంద్రబాబు మాత్రం కేంద్రంపై ఏమి మాట్లాడాలన్నా ఇప్పటికీ వంగి వంగి కేంద్రంతో తగవు పడితే నిదులు రావు.. అంటూ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కూడా అదే మాటలు చెబుతున్నాడు.
ఇక చంద్రబాబు నాడు వెంకయ్యనాయుడు కాంగ్రెస్‌ని 10ఏళ్లు కాదు. 15ఏళ్లు కావాలని చెప్పినప్పుడు చంద్రబాబుతో సహా ఆయన పార్టీ ఎంపీలు, సుజనా చౌదరి వంటి వారు మావల్లే ఇది వచ్చిందని సంబరపడి భుజాలు కొట్టుకున్న వారు కాదా? మరలా ఎన్నికల సమయానికే వీరికి ప్రత్యేక హోదాలు, ప్యాకేజీలు గుర్తుకొస్తున్నాయా? కేసీఆర్ చేసిన ధైర్యం కూడా చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు. ఆయన వైపు కూడా తప్పుంది కాబట్టే తేలు కుట్టిన దొంగలా ఉన్నాడని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికైనా కేంద్రంలో తృతీయ ఫ్రంట్ వచ్చి మమతా బెనర్జీ వంటి వారు ప్రధాని అవుతారో లేదో వేచిచూడాల్సివుంది..!