మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ విషయం పక్కన పెడితే ఏపీలో కూడా కేసీఆర్ పాలనను మెచ్చుకుంటున్న వారు పెరుగుతున్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కి లేని ఫాలోయింగ్ కూడా కేసీఆర్ తనయుడు కేటీఆర్‌కి ఆంధ్రాలో ఉందనేది వాస్తవం. నారా లోకేష్‌ని కేటీఆర్‌లని పోలుస్తూనే కొందరు లోకేష్‌ని పప్పుగా అభివర్ణించారు. ఇక కేటీఆర్ ఈమధ్య తనదైన శైలిలో రాణిస్తున్న తీరు చూసి రెండు తెలుగు రాష్ట్రాలలోని యువతకు కేటీఆర్ యూత్ ఐకాన్‌గా మారాడనేది వాస్తవం. ఇక ఇటీవల కేటీఆర్ తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడ్డాడు. జిల్లా జిల్లా తిరిగి అభివృద్ది పనులు చేస్తున్న కేసీఆర్ పాలనను తట్టుకోలేక డిప్రెషన్‌తో కాంగ్రెస్ నేతలు తన తండ్రి కేసీఆర్‌పై తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డాడు. ఇక జనాలకే కాదు సినిమా సెలబ్రిటీలను కూడా కేటీఆర్ ఆకర్షిస్తున్నాడు. నిఖిల్, విజయ్‌దేవరకొండ నుంచి అందరు ఆయనకు ఫ్యాన్‌గా మారారు.
ఇక ఇటీవల కేటీఆర్ 'తొలిప్రేమ' చిత్రం చూడటంపై కూడా కాంగ్రెస్ నేతల అవాక్కులు చెవాక్కులు పేలారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఈయనకు సినిమాలు కావాలా? అని విమర్శించారు. అయితే మంత్రి అయినంత మాత్రాన రెండు గంటల వినోదం కోసం సినిమా చూడటం కూడా ఎలా తప్పవుతుంది? ఇక తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కి డిపాజిట్లు కూడా రావని, తాము అధికారంలోకి వస్తామని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో పలు అవినీతి పనులు చేస్తూ దోచుకుతింటున్న కేసీఆర్, కేటీఆర్‌లను జైలుకి పంపుతామన్నారు. ఇక గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ఆంధ్రాలో జగన్‌ని జైలుకి పంపుతామన్నారు. మోదీ వస్తే విజయ్‌మాల్యాతో పాటు పలువురు ఆర్ధిక నేరగాళ్లు, బ్యాంకులకు బకాయి పడిన వారిని, స్విస్ నల్లకుబేరులను జైలుకి పంపిస్తామని చెప్పారు. కాబట్టి కోమటి రెడ్డి వ్యాఖ్యలు కూడా అదే తరహా అని చెప్పాలి.
ఇక తాజాగా కాంగ్రెస్ సీనియర్‌నేత జానారెడ్డి కేటీఆర్ గురించి తాను స్పందించి, తన స్థాయికి తగ్గించుకోనని అన్నాడు. ఇక షబ్బీర్ అలీ నుంచి పలువురు కాంగ్రెస్ నాయకులు కేటీఆర్‌ని బచ్చాగాడు అన్నారు. దీనికి కేటీఆర్ సమాధానం ఇస్తూ సూట్‌బూటు వేసుకుని మాట్లాడితే అమెరికా భాష అని విమర్శిస్తారని, అదే ప్రజల్లోకి వెళ్లి ప్రజల భాషలో మాట్లాడితే మరోలా విమర్శిస్తారని అన్నారు మరో సారి బచ్చా అంటే తాను ఎలాంటి కౌంటర్ ఇస్తానో చూడండి అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఎంత వయసు విషయం పక్కనపెట్టినా కూడా ఎక్కడైనా సరే 'పోకిరి'లో చెప్పినట్లు ఎప్పుడు వచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా? అనేదే ముఖ్యం అన్నట్లుగా మంత్రిగా ఉన్న కేటీఆర్‌ని బచ్చా అని పిలవడం మాత్రం పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదనే చెప్పాలి.