కుర్ర దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మహానటి సావిత్రి జీవిత చరిత్రగా 'మహానటి' సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ కూతుర్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది. మహానటి సినిమాని ఈ నెలాఖరులో విడుదల చేస్తామని చెప్పినప్పటికీ... కొన్ని కారణాల వలన సినిమా మార్చ్ నెలాఖరున విడుదలయ్యే సూచనలు కనబడడం లేదు. అయితే ఈ సినిమాలో మహామహులు నటిస్తున్నారు. తెలుగు తమిళ నటులు భాగస్వాములైన ఈ సినిమాపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. సీనియర్ హీరోయిన్ సావిత్రికి బాగా కావాల్సిన జమున ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూ లో ఈ సినిమాని దర్శకుడు ఏ విధంగా తెరకెక్కిస్తున్నాడు. అసలు సావిత్రి గారి గురించి అతనికేం తెలుసు. సావిత్రితో అనుబంధం ఉన్న నన్ను సంప్రదించకుండా ఈ సినిమాని ఎలా తీస్తున్నారు. అలాగే తెలుగు రాని అమ్మాయి సావిత్రి పాత్రలో ఎలా నటిస్తుంది.. అంటూ హీరోయిన్ కీర్తి సురేష్ ని ఉద్దేశించి కొన్ని సెటైర్స్ వేసింది.
మరి దానికి కౌంటర్ గానో.. ఏమో గాని ఇప్పుడు కీర్తి సురేష్ జమున గారి మాటలకూ కౌంటర్ ఇచ్చినట్లుగానే కనబడుతుంది. అదేమిటంటే అసలు సినిమా విడుదలయ్యాక ఆ సినిమా చూసాక ఈ సినిమాపై విమర్శలు చేస్తే బావుంటుందని అనడమే కాదు.. సావిత్రి గారి గురించి పూర్తిగా తెలుసుకున్నాకే తాను మహానటి పాత్రని ఒప్పుకున్నట్లుగా చెబుతుంది. అలాగే సావిత్రి గారి సినిమాలను చూసి ఆమె హావభావాలను నేర్చుకున్నానని... ఇంకా సావిత్రి గారి గురించిన అనేక పుస్తకాలు తిరగేశానని... అలాగే సావిత్రి గారి కూతుర్ని కలిసి సావిత్రిగారి గురించి తెలుసుకున్నాక ఈమహానటిలో సావిత్రి పాత్రలో నటిస్తున్నానని చెప్పింది.
అలాగే సావిత్రి గారి అలవాట్లకు తన అలవాట్లకు దగ్గర పోలికలు ఉన్నాయని చెప్పిన కీర్తి సురేష్ అవేమిటో కూడా చెప్పింది. సావిత్రి గారికి ఇష్టమైన క్రికెట్, స్విమ్మింగ్ లాంటివి తనకు ఇష్టమని చెప్పిన కీర్తి ఆ సినిమాపై విమర్శలు చెయ్యాలంటే... సినిమా చూసాకే చెయ్యాలని సున్నితంగా తనని విమర్శించేవాళ్లకు కౌంటర్ ఇచ్చేసింది. మరి కీర్తి సురేష్ ఇంత కాన్ఫిడెంట్ గా ఉంది అంటే... మహానటి సినిమా కూడా అంతే బాగా వచ్చిండాలి. చూద్దాం మరో నెల్లో ఈ సినిమా ఎలా ఉంటుందో తెలిసిపోతుంది.