అతిలోక సుందరి హఠాన్మరణంతో భారతదేశంలోని ప్రతి ఒక్కరు ఉలిక్కి పడ్డారు. ఆమె మరణంతో అభిమానులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. టాప్ సెలెబ్రిటీస్ దగ్గరనుండి... చిన్న చిన్న ఆర్టిస్ట్ ల వరకు శ్రీదేవి మరణాన్ని నమ్మలేని నిజంగా ఆమె ఆత్మకు శాంతిని కలగజెయ్యాలని ట్వీట్స్ మీద ట్వీట్స్ చేస్తున్నారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ మొత్తం ఒక్కటై కదిలింది. వారంతా శ్రీదేవికి కడసారి వీడ్కోలు చెప్పేందుకు ముంబైలో ఎదురు చూపులతో గడుపుతున్నారు. కానీ శ్రీదేవి చనిపోయి నాలుగు రోజులు గడుస్తున్నా ఆమెని ముంబైకి తీసుకురావడానికి తీవ్ర జాప్యం జరుగుతుంది. శ్రీదేవిది హత్యా? ఆత్మహత్యా? అని దుబాయ్ లోని పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ లు అనుమానం లేవనెత్తారు.
అయితే శ్రీదేవి చనిపోవడంతో ఆమె అభిమానులు ఘొల్లుమన్నారు. ఎందరో నటీమణులు తమ అభిమాన నటి చనిపోవడం తమకు బాధాకరమని చెబుతున్నారు. అయితే ఒక టాప్ హీరోయిన్ మాత్రం శ్రీదేవి మరణంతో జ్వరం తెచ్చుకుంది. ఆమె ఎవరో కాదు... బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. శ్రీదేవి హఠాన్మరణంతో షాక్ కి గురైన కంగనా రనౌత్ జ్వరం తెచ్చుకుని బాధపడుతుందట. ఈ విషయాన్ని కంగనా సన్నిహితులు చెబుతున్నారు. శ్రీదేవి మరణాన్ని జీర్ణించుకోలేని కంగనాకి జ్వరం వచ్చిందని.. అందుకే ఆమె పాల్గొనాల్సిన షూటింగ్ కి ప్రస్తుతం బ్రేక్ పడినట్లుగా చెబుతున్నారు.
క్రిష్ డైరెక్షన్ లో కంగనా 'మణికర్ణిక' అనే చారిత్రాత్మక చిత్రంలో నటిస్తుంది. ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మణికర్ణిక షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. కానీ ఇప్పుడు శ్రీదేవి మరణంతో జ్వరం తెచ్చుకున్న కంగనా రనౌత్ వలన మణికర్ణిక షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇక కంగనా ఫీవర్ తాగ్గాకే.. మణికర్ణిక షూటింగ్ మొదలెట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక శ్రీదేవి ముంబయి రాక కోసం బాలీవుడ్ లోను ప్రముఖులతో పాటే.. ఆమె అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. శ్రీదేవిని కడసారి చూసేందుకు ఆమెకు... నివాళులర్పించేందుకు చాలామంది ముంబయిలోనే కాచుకుని కూర్చున్నారు.