అతిలోక సుందరి మరణంతో బిగ్‌బి అమితాబ్‌బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, వెంకటేష్,నాగార్జున, ఆమెతో నటించని బాలకృష్ణలు కూడా తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. ఇక నిర్మాత అశ్వనీదత్ అయితే మరో మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆయనకు శ్రీదేవితో మంచి అనుబంధం ఉంది. అశ్వనీదత్ నిర్మాతగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున, శ్రీదేవి నటించిన 'ఆఖరి పోరాటం', చిరంజీవి, శ్రీదేవి కలిసి నటించిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి', రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన 'గోవిందా గోవిందా' వంటి చిత్రాలలో శ్రీదేవి నటించింది. ఇలా అశ్వనీదత్‌తో, ఆయన బేనర్ వైజయంతి మూవీస్‌తో శ్రీదేవికి ఎంతో అనుబంధం ఉంది. అందుకోసమే ఆయన తాను తీస్తున్న సావిత్రి బయోపిక్ 'మహానటి' చిత్రాన్ని శ్రీదేవికి అంకితం ఇవ్వాలని నిర్ణయించాడు. వీలుంటే ఈయనే శ్రీదేవి బయోపిక్‌ని కూడా నిర్మించవచ్చు అనే వార్తలు వస్తున్నాయి.
ఇక శ్రీదేవికి తెల్లని రంగు అంటే ఎంతో ఇష్టం. తాను నటించిన చిత్రాలలో, మరీ ముఖ్యంగా పాటలలో ఆమెకి తెలుపు రంగుపై ఉన్న ప్రేమ అర్ధమవుతుంది. ఇక శ్రీదేవి కూడా తన బంధుమిత్రులతో నేను మరణించిన తర్వాత అంతా తెలుపు రంగుతో అంత్యక్రియలు జరపాలని కోరుకుందట. దానికి అనుగుణంగానే ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న వారు తెల్లని పూలను అనిల్‌కపూర్ ఇంటిలో ఇచ్చివెళ్తున్నారు. ఇక ఈమెని అంత్యక్రియలకు తీసుకెళ్లే వాహనం కూడా తెలుపురంగులోనే ఉండేలా చూస్తున్నారు. ఆమె జుహూలోని అంత్యక్రియల జరిపే ప్రాంతంలో ఆమె వాహనాన్ని ఊరేగించే ప్రదేశం మొత్తం తెల్లని పూలతో రెడీ చేస్తున్నారు. నిజంగానే శ్రీదేవి మనసు తెల్లనిది.. చల్లనిది అనే చెప్పాలి.