ఓ సినీ ప్రముఖులు మరో సినీ నటిని వీర స్థాయిలో అభిమానించి, ప్రేమించడం అంటే మాటలు కాదు. కొందరికి మనసులో భావాలున్నా చెప్పుకోలేరు. ఒప్పుకోలేరు. కానీ ఈ విషయంలో రాంగోపాల్‌వర్మ స్టైలే వేరు. ఆయన శ్రీదేవిపై తనకున్న అభిమానాన్ని, ప్రేమను, ఆమె జీవిత భాగస్వామిగా మారి ఆమె అందాలను అనుభవించాల్సిన అవకాశం లేకపోవడం చాలా బాధాకరం అని ఎప్పుడు చెబుతూ ఉంటాడు. ఇక వర్మ ఆమధ్య తన ఇంట్లో హోమ్ థియేటర్‌లో శ్రీదేవి నటించిన ఓ బాలీవుడ్ చిత్రంలోని పాటను తదేకంగా చూస్తూ, పక్కనే వోడ్కా పెట్టుకుని ఉన్న వీడియోను చార్మి 'శ్రీదేవి భక్తుడు' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక సింగపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో పింగాణితో చేసిన శ్రీదేవి విగ్రహం ఉంది. ఆమె అచ్చు శ్రీదేవిలా భారతదేశ సాంప్రదాయంలో చీరకట్టుతో ఆకట్టుకుంటూ ఉంటుంది.
ఇక శ్రీదేవి పేరు మీద ఓ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్‌ని స్థాపించి, దేశ విదేశాలలో ఫ్రాంచైజీలు తెరవడానికి చెన్నైలోని ప్రముఖ పారిశ్రామిక వేత్త, శ్రీదేవి వీరాభిమాని ఆమె నుంచి ఆమె భర్త బోనీకపూర్‌ని కూడా కలిసి పర్మిషన్ తీసుకున్నాడు. ఈ నట శిక్షణ సంస్థలో ఆయన కేవలం శ్రీదేవి నటన, డ్యాన్స్ వంటి వాటిని చూపిస్తూనే శిక్షణ ఇవ్వాలని భావించాడు. శ్రీదేవి కూడా ఆ ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చి గెస్ట్ లెక్చర్స్ ఇవ్వాలని, ఆమె చేతుల మీదుగానే దీనిని ప్రారంభించాలని భావించాడు. ఇక బెంగుళూరులోని అమె అభిమానులు ఆమె జీవితంపై డాక్యుమెంటరీ తీసి నాలుగైదు భాగాలుగా వాటిని రిలీజ్ చేయాలని ముందుకొచ్చారు. ఇలా చెప్పుకుంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇక నిన్న నాగార్జున-వర్మల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తామని భావించి వాటిని కూడా వద్దనుకున్నారు. ఇక నాగ్-వర్మలు సాయంత్రం ముంబై చేరుకుని ఆమె మృతదేహాన్ని చూడనున్నారు. ఇక నాగ్‌కి కూడా శ్రీదేవి అంటే ఎంతో అభిమానం, ఆమె అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌లో పలు చిత్రాలలో నటించడమే కాకుండా, నాగ్‌తో మూడు చిత్రాలలో నటించింది.
ఇక ఆయన 'శ్రీదేవిని చంపిన దేవుడిని ద్వేషిస్తున్నా.. మరణించిన శ్రీదేవిని ద్వేషిస్తూన్నా...అంటూనే చివరలో శ్రీదేవిని జీవితాంతం ఆరాధిస్తూనే ఉంటాను. ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటానని చెప్పాడు. శ్రీదేవి వంటి దేవత కూడా మామూలు మనిషిలా మరణించడం ఏమిటి? నేను శ్రీదేవి గురించి చేసే చివరి ట్వీట్ ఇదే. ఇక నుంచి ఆమె బతికే ఉందని భావిస్తూ జీవిస్తాను. శ్రీదేవి గారు నేను మిమ్మల్ని ఇంత నవ్వించిన కూడా మీరు నన్ను ఇంతలా ఏడిపించడం అన్యాయం. ఇక నేనెప్పుడు మీతో మాట్లాడను. జీవితాంతం కటీఫ్' అని ఉద్వేగభరితమైన ట్వీట్ చేశాడు. ఇక శ్రీదేవి బోనీకపూర్‌ని చేసుకోవడం ఇష్టంలేని వర్మ బోనీపై చేసిన వ్యాఖ్యలు, ఆ మద్య శ్రీదేవి, బోనీకపూర్‌లు ముద్దు పెట్టుకుంటున్న ఫొటోలను చూసి వర్మ తనకి కపూర్ అంటే ద్వేషమని చెప్పిన సంగతి తెలిసిందే.