దేశవిదేశాలలో ఎందరి చేతనో ఆరాధ్యదేవతగా పిలువబడే శ్రీదేవి భౌతికకాయం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు దుబాయ్ నుంచి ముంబై చేరుకోనుంది. దీంతో ఆమె అంత్యక్రియల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ముంబైలోని జుహూ స్మశాన వాటికలో ఆమె దహన క్రియలు జరుగనున్నాయి. తమ అభిమాన నటి ఇకలేరని తెలుసుకుని సామాన్యప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖుల వరకు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆమె భౌతిక కాయాన్ని చివరి సారిగా చూసేందుకు ఆమె ముంబైలోని నివాసం వద్ద అభిమానులు, సినీ ప్రముఖుల భారీగా పోటెత్తుతున్నారు. దీనితో అక్కడ పోలీస్ బలగాలను మోహరించారు. ఈ రోజు సాయంత్రమే అంత్యక్రియలు జరుగనున్నాయి. అంతకు ముందు ప్రజల సందర్శనార్ధం ఆమె భౌతిక కాయాన్ని కొంత సేపు ఉంచనున్నారు. తదనంతరం అంత్యక్రియలు జరుగుతాయి.
మరోవైపు శ్రీదేవి జీవితం తొలి నుంచి కష్టాలమయంగానే సాగింది. వృత్తిపరంగా ఆమె అధిరోహించని ఎత్తులు లేవు గానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమె ఎప్పుడు ఎదురు దెబ్బలు తింటూనే ఉంది. ఈమె తన 4వ ఏటనే తమిళ చిత్రం 'కందన్‌కరుణ్' చిత్రంలో నటించింది. ఇక తెలుగులో ఈమె బాలనటిగా నటించిన మొదటి చిత్రం 'మానాన్న నిర్దోషి'. ఆ తర్వాత ఎన్టీఆర్‌కి మనవరాలిగా 'బడిపంతులు' చిత్రంలో నటించింది. తన రీఎంట్రిని 'ఇంగ్లీష్ వింగ్లీష్' ద్వారా ఇచ్చి, 'పులి' తర్వాత 'మామ్' తో ఆమె నటజీవితం ఆగిపోయింది. అదే ఆమె బతికుంటే ఎన్నో చిత్రాలు చేసి ఉండేది. 50ఏళ్ల కెరీర్ అంటే సామాన్యం కాదు. 4వ ఏట నుంచి 54 వ ఏట వరకు నటిస్తూనే ఉంది.
ఇక హీరోల డామినేషన్ ఉండే చిత్రరంగంలో హీరోల లైఫ్ పీరియడ్ ఎంతో ఎక్కువగా ఉంటుంది. వారి పక్కన నటించిన హీరోయిన్లే కొంత కాలం తర్వాత అదే హీరోలకు అత్త, అమ్మ వంటి పాత్రలు చేస్తారు. ఆ విధానానికి బ్రేక్ చెప్పిన ఒకే ఒక నటి శ్రీదేవి. ఈమె ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి చిత్రాలలో బాలనటిగా నటించి ఆ తర్వాత వారితో జోడీ కట్టి తర్వాత చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతో కూడా జతకట్టింది. వాస్తవానికి ఈ 50 ఏళ్ల కెరీరలో ఆమె మూడు జనరేషన్స్ నటీనటులను చూసింది. ఈమె మొత్తంగా తన కెరీర్‌లో ఏకంగా 15 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సాధించం విశేషం.