మహారాణులు, ఇతర వీరోచిత పాత్రలకు ఎంపిక చేసే నటుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. వీరనారిగా, మహారాణిగా అందం, ఠీవి, రాజసం ఉట్టిపడే చురకత్తుల వంటి చూపులు, నడక నుంచి హావభావాల వరకు రాజసం కనిపించాలి. అందుకే అలాంటి పాత్రలకు తెలుగులో అనుష్క, మలయాళంలో నయనతార, బాలీవుడ్‌లో ప్రియాంకాచోప్రా, దీపికాపడుకొనే, కంగనా రౌనత్ వంటి వారినే ఎంచుకుంటారు. ఇక తెలుగులో పలు చిత్రాల ద్వారా పేరు తెచ్చుకుని 'గౌతమీ పుత్ర శాతకర్ణి'ని అద్భుతంగా తీసిన క్రిష్ ప్రస్తుతం వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ బయోపిక్‌గా 'మణికర్ణిక' చిత్రం తీస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌లో కంగనాకి కాస్త గాయం కావడం వల్ల ఆలస్యమైందే గానీ లేకపోతే ఈ ఏప్రిల్‌లోనే చెప్పిన సమయానికి క్రిష్ ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఉండేవాడు.
ఇక ఈ 'మణికర్ణిక'ను ఆగష్టు15న స్వాతంత్య్రదినోత్సవ కానుకగా విడుదల చేయనున్నారు. అదే రోజు అక్షయ్‌కుమార్ 'గోల్డ్', '2.0'లు కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ ఇంతగా పూర్తయినా గానీ అఫీషియల్‌గా యూనిట్ లుక్‌ని విడుదల చేయలేదు. కానీ సెట్స్‌లో తీసిన ఫొటోలను లీక్ చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్‌లోని బికనీర్, జైపూర్‌లో జరుగుతోంది. రాజదర్బార్ సెట్‌లో కంగనా ఝూన్సీలక్ష్మీభాయ్‌గా కనిపించే లుక్‌లో వంటి నిండా ఆభరణాలు ధరించుకుని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది.
ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి 'బాహుబలి, భజరంగీ భాయిజాన్' రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించడం విశేషం, కానీ ఇందులో లక్ష్మీభాయ్‌కి, బ్రిటిష్ సైనికునితో కొన్ని అసభ్య సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేశాయి. కానీ క్రిష్ అలాంటిదేమీ ఉండదని భరోసా ఇవ్వడంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఇక ఇందులో 'రేసుగుర్రం' నటుడు రవికిషన్ కీలకపాత్రను పోషిస్తుండగా, కమల్‌జైన్‌తో పాటు కంగనా కూడా ఈ చిత్రం నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది.