కమల్‌హాసన్ రాజకీయ అరంగ్రేటం తాజాగా ప్రారంభమైంది. ఆయన పార్టీ పేరుతో పాటు దక్షిణాదిలోని తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుద్దుచ్చేరిలను కలుపుకుని ఆరు చేతులు పెనవేసుకుని చేతులు చేతులు పట్టుకున్నట్లుగా లోగోని విడుదల చేశాడు. ఇక కమల్‌హాసన్ తాను నటించే రెండు చిత్రాలు మాత్రమే విడుదల అవుతాయని, దాని తర్వాత తాను సినిమాలు చేయనని, ప్రజాసేవకే అంకితమవుతానని తెలిపాడు. దీంతో ఆ రెండు చిత్రాలు 'విశ్వరూపం 2'తో పాటు శంకర్ దర్శకత్వంలో ఆయన చేయబోయే 'భారతీయుడు 2' అని తెలుస్తోంది. కమల్ తన ఎజెండా ఉత్తరాది రాష్ట్రాలకంటే దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూడటం నుంచి ద్రవిడ ఉద్యమంలో భాగంగా హిందీని కూడా వ్యతిరేకించే స్థాయిలోనే ఉండనుందని, తాను మోదీనే లక్ష్యంగా చేసుకున్నానని ఆయన చెప్పకనే చెప్పాడు.
ఈ నేపధ్యంలో శంకర్‌తో ఆయన చేయబోయే 'భారతీయుడు 2'లో బిజెపికి చెందిన పలువురు నాయకుల కుంభకోణాలు, నోట్ల రద్దు, జీఎస్టీ, దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు వంటి వాటితో పాటు విజయ్‌మాల్యా, గాలి జనార్ధన్‌రెడ్డి నుంచి నీరవ్ మోదీ కుంభకోణం వరకు ఇందులో పొందు పరిచేలా చూడమని కమల్ శంకర్‌ని కోరాడని సమాచారం. దాంతో నీరవ్ కుంభకోణం. ఓ అనామకుడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు? ఒకరికి తెలియకుండా ఒకరిని ఎలా మోసం చేశాడు? ఆయనకు సహకరించిన వారు ఎవరు? 17వేల కోట్ల స్కాం జరిగితే మోదీ, జైట్లీలు మౌనంగా ఎలా ఉన్నారు? వంటి పలు అంశాలను చేర్చి వారిపై కమల్ 'సేనాపతి' భారతీయునిగా వారిపై, వారి అవినీతిపై చేసే ఉద్యమం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది.
ఇక కమల్ మధురై సభలో కూడా తాను మొదట అవినీతిపై దృష్టిపెడతానని ప్రకటించాడు. దీంతో ప్రస్తుతం తన 'భారతీయుడు 2'లో నీరవ్ మోదీ, హత్యకి గురైనా గౌరీ లంకేష్ వంటి పలు వాస్తవిక, నేటి సమాజంలో ఉన్న హాట్ అంశాలను టచ్ చేయనున్నాడట. మరి మరోవైపు నీరవ్‌మోదీ మీద వర్మ చూపు పడలేదా? ఈ పాటికే ఆయన తన ప్రచారం కోసమైనా నీరవ్‌మోదీ చరిత్రపై సినిమా తీస్తానని చెప్పి సంచలనం సృష్టించకపోవడం ఏమిటని? పలువురు ఆశ్యర్యపోతున్నారు.