ప్రియా ప్రకాష్ వారియర్. చదివేది డిగ్రీ ఫస్ట్‌ఇయర్ అంటే ఇంకా టీనేజ్‌లోనే ఉంది. ఇక నటిగా తనకు వచ్చిన అవకాశంని సద్వినియోగం చేసుకుంటూ ఒమర్‌లల్లూ దర్శకత్వంలో 'ఒరు ఆధార్ లవ్'లో నటిస్తోంది. ఇందులో ఆమెది మెయిన్ హీరోయిన్ పాత్ర కూడా కాదు. కొంచెం ప్రాధాన్యం ఉన్న పాత్ర మాత్రమే. కానీ ఈ చిత్రంలోని పాటను రిలీజ్ చేస్తే అందులో కేవలం తన మోములో హావభావాలతో ఆమె ఇంటర్నెట్ సంచనలంగా మారింది. ఈ పాట, ఇందులోని ఆమె అభినయం ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని, అల్లాని అవమానించారని చెప్పి హైదరాబాద్‌లో ఈ చిత్రం యూనిట్‌పై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్ కూడా ఫైల్ అయింది. అదే సమయంలో మహారాష్ట్రలో కూడా పలువురు ఈ చిత్రంపై పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కారు.
అయినా ఈ చిన్నది భయపడలేదు. సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి, తన మీద, తమ చిత్ర యూనిట్ మీద క్రిమినల్ కేసులు నమోదవ్వకుండా చూడాలని, తమ చిత్రం విడుదలకు ఎలాంటి ఆటంకాలు ఎదురు కానివ్వవద్దని ఆమె సుప్రీంకోర్టుని కోరింది. వాస్తవానికి ఈ పని దర్శకుడు, నిర్మాతలు చేయాలి. కానీ ప్రియా వారియర్ తానే ముందుకొచ్చి దీనిపై ముందడుగు వేసింది. నేటి యువత మరీ ముఖ్యంగా యువతులు ఎంత ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నారో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.
ఇక సుప్రీం కోర్టు కూడా ఆమెకి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. సుప్రీంకోర్టుకి కృతజ్ఞతలు. 'మాణిక్య మలరయా పూవై' పాటపై అభ్యంతరం తెలుపుతూ, నాపై, నా దర్శకుడు ఒమర్‌లల్లూపై హైదరాబాద్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై స్టే విధించడంతో పాటు ఇతర ఏ ప్రాంతాలలో కూడా కేసులు నమోదు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాకు సహకరించిన అడ్వకేట్ హారిస్ బీరన్‌కి, మద్దతుగా నిలిచిన శ్రేయోభిలాషులు, సన్నిహితులకు, మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపింది. మొత్తానికి ఈ పిల్ల మామూలు పిల్ల కాదు.. పిడుగనే చెప్పాలి.