తనదైన ట్వీట్స్, వీడియోలు, విమర్శలు, వివాదాలతో నిత్యం వివాదాలలో ఉండే సీనియర్ దర్శకుడు వర్మ. ఇక తాజాగా నాని నిర్మాతగా 'అ!'అనే చిత్రం తీసి, సామాన్యంగా ఏ చిత్రాన్ని బాగుందని ఒప్పుకోరనే పేరున్న క్రిటిక్స్ చేత తనదైన ప్రత్యేకమైన కాన్సెప్ట్, టేకింగ్‌తో ప్రశాంత్ వర్మ ఇండస్ట్రీలోని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈయన సినిమాని తెరకెక్కించిన విధానం చూసి విశ్లేషకులు శభాష్ అంటున్నారు. ఇక ఈ చిత్రం ఒకసారి చూస్తే తెలుగు సామాన్య ప్రేక్షకులకు అర్దం కాకపోవచ్చు గానీ శ్రద్దగా చూస్తే మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. ఈ చిన్న సినిమా సాధిస్తోన్న పెద్ద విజయం ఇదే విషయాన్ని నిరూపిస్తోంది. తన వద్ద 30 వరకు స్టోరీలు ఉన్నాయని, వీటిలో కొన్నింటిని బయటి వారికి అమ్ముతానని, కొన్నింటిని తానే తీస్తానని ఇతను చెబుతున్నాడు.
ఇక ఈయన సెకండ్ ప్రాజెక్ట్ కూడా వినూత్న సబ్జెక్ట్‌తోనే తక్కువ బడ్జెట్‌లో భారీ బేనర్‌లో ఉంటుందని సమాచారం. ఫిబ్రవరి నెల ద్వారా ప్రశాంత్‌వర్మ, వెంకీ కుడుముల, వెంకీ అట్లూరి అంటూ ముగ్గురు ప్రామిసింగ్ కొత్త డైరెక్టర్స్ మనకి దొరికారు. ఇక విక్రమ్‌సిరికొండ, మంజుల ఘట్టమనేని మాత్రం ఫెయిల్ అయ్యారు.
ఇక విషయానికి వస్తే తాజాగా ప్రశాంత్ వర్మ.. తనను అందరు రాంగోపాల్ వర్మతో పోలుస్తున్నారని, కానీ ఆయనకు నాకు రెండు అంశాలు మాత్రమే పోలిక ఉందని, అందులో ఒకటి వర్మ అనే ఇంటిపేరు ఒకటైతే, రెండోది ఇద్దరం శ్రీదేవి ఫ్యాన్స్ కావడమేనని ట్వీట్ చేశాడు. దీనిని మెచ్చిన వర్మ 'అ!' అంటూ పేస్‌బుక్‌లో స్పందించాడు. చూసేందుకు ఇది వర్మని పొగుడుతున్నట్లే ఉన్నా కూడా వర్మలాగా తాను పట్టాలు తప్పి సినిమాలు తీయనని, ఆయనలా వివాదాలు, ట్వీట్స్‌తో కాలక్షేపం చేయనని ఆయన ట్వీట్‌కి అర్ధంగా చెప్పుకోవచ్చు. ఇక శ్రీదేవి అనే కామన్ పాయింట్‌ని వర్మ అనే ఇంటిపేరును ప్రస్తావించి వర్మకి ఎక్కడో టచ్ అయ్యేలా ఈ కుర్రాడు చేయగలిగాడు అనే చెప్పాలి...!