హరికృష్ణ కొడుకులైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల మధ్య ఈ మధ్యన సాన్నిహిత్యం ఎక్కువగా కనబడుతుంది. ఒకప్పుడు కుటుంబం కోసం కళ్యాణ్ రామ్... తమ్ముడు ఎన్టీఆర్ ని పక్కన పెట్టినప్పటికీ హరికృష్ణ కోసం మళ్ళీ తమ్ముడిని కలుపుకు పోతున్నాడు. అందులోను జానకి రామ్ మరణంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఒక తల్లి బిడ్డల్లా మెసులుతున్నారు. అన్న కళ్యాణ్ రామ్ కోసం తమ్ముడు ఒక సినిమా చేసి అతన్ని అప్పుల బారి నుండి ఒడ్డున పడెయ్యడం... వంటి విషయంతో వారి మధ్యన అనుబంధం ఎంతగా పెనవేసుకుపోయిందో అర్ధమవుతుంది. హరికృష్ణకి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ రెండు కళ్ళలా మారిపోయారు. తండ్రిని గౌరవిస్తూ తమ తమ సినిమా షూటింగ్స్ బిజీగా మారిపోయినా ఈ అన్నదమ్ములిద్దరూ కలిసి ఒకే సినిమాలో ఇంతవరకు కనబడలేదు.
కానీ ఇప్పుడు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, హరికృష్ణలు కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారని న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా కోసం వెయిట్ చేస్తుంటే... కళ్యాణ్ రామ్ మాత్రం 'ఎమ్యెల్యే, నా నువ్వే' సినిమా షూటింగ్స్ తో బిజీగా వున్నాడు. ఇక హరికృష్ణ చాన్నాళ్లుగా వెండితెరకు దూరంగానే ఉంటున్నాడు. అయితే తాజాగా హరికృష్ణ, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు కలిసి నటించబోతున్నారు అనే న్యూస్ బాగా వినబడుతుంది.
దర్శకుడు పవన్ సాధినేని చెప్పిన కథ కళ్యాణ్ రామ్ కి బాగా నచ్చడంతో... ఈ సినిమా లో ఎన్టీఆర్ తోపాటు... తన తండ్రిని కూడా నటింపజేస్తే బావుంటుందని కళ్యాణ్ రామ్ ఆలోచనగా చెబుతున్నారు. ఆ కథలో ఉన్న ఆ రెండు కీలక పాత్రల్లో ఎన్టీఆర్, హరికృష్ణ అయితేనే బావుంటుందని కూడా కళ్యాణ్ రామ్ అనుకుంటున్నాడట. మరి అన్న మాటకు విలువిచ్చి ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తాడో లేదో తెలియాల్సి ఉంది. మరి నిజంగా ఇలా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, హరికృష్ణలు ఒకే సినిమాలో నటిస్తే.. నందమూరి, ఎన్టీఆర్ అభిమానులకు పండగే పండగ.