హిట్స్‌లో ఉన్న హీరోయిన్ తప్పుకుంటే గాబరా పడాలి. పోనీ ఐరన్‌లెగ్ సినిమాని వదులుకుంటే సంతోష పడాలి. కానీ ఓ ఐరన్‌లెగ్ స్థానంలో మరో ఐరన్‌లెగ్ ఎంట్రీ ఇస్తే అది పెద్దగా విషయం ఏమీ కాదు. రిజల్ట్‌లో, సెంటిమెంట్ పరంగా కూడా ఏమీ తేడా ఉండదు. ఇప్పుడు ఓ చిత్రం విషయంలో అదే జరిగింది. గతంలో కోనవెంకట్ రచయితగా పని చేసిన పలు చిత్రాలకు రచనా సహకారం అందించిన రచయిత శ్రీధర్ సీపాన. ఆ తర్వాత ఆయన 'పూలరంగడు, అహనా పెళ్లంట, భీమవరం బుల్లోడు' వంటి చిత్రాలకు సొంతగా రచయితగా పనిచేశాడు.
ఇప్పుడు ఈ రచయిత కూడా మెగాఫోన్ పట్టాడు. మొత్తానికి ఏలాగోలా నిర్మాతలకు వల వేశాడు. 'గుంటూర్ టాకీస్' ఫేమ్ సిద్దు, పలు చిత్రాలలో నటించినా, చివరకు 'రాజుగారి గది 2'లో అందాలను ఆరబోసిన సక్సెస్ కాని సీరత్ కపూర్‌లు ఇందులో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ని కూడా 'బృందావనమది అందరిది' అని పెట్టారు. మొత్తానికి తన గురువు కోన 'శంకరాభరణం' టైటిల్‌ని పెట్టినట్లే శ్రీధర్ సీపాన కూడా పాత చిత్రంలోని క్లాసిక్ పాటలోంచి టైటిల్‌ని ఎత్తేశాడు. ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలైంది. కొన్నిరోజుల షూటింగ్ తర్వాత సీరత్ కపూర్ ఈ చిత్రం నుంచి బయటకి వచ్చేసింది. పోనీ ఈమె ఇతర సినిమాలలో బిజీనా అంటే చేతిలో ఒక్క చిత్రం కూడా లేదు.
రవితేజ సరసన ఎన్నో ఆశలతో చేసిన 'టచ్ చేసి చూడు'లో సెకండ్ హీరోయిన్ పాత్రే అయినప్పటకీ ఆమె ఐరన్‌లెగ్ మహిమ ఆ చిత్రానికి కూడా కొట్టింది. దీంతో దర్శకుడు శ్రీధర్ సీపాన తన చిత్రంలో సీరత్ కపూర్‌కి బదులు అల్లరి నరేష్ 'యముడికి మొగుడు', సునీల్ 'ఈడు గోల్డ్ ఎహె' వంటి డిజాస్టర్ చిత్రాలలో నటించిన మరో ఐరన్‌లెగ్ రిచా పనాయ్‌ని ఆమె ప్లేస్‌లో పెట్టుకున్నాడు. మొత్తానికి ఇందులో ఎవరు నటించినా పట్టించుకునే పరిస్థితుల్లో మాత్రం ప్రేక్షకులు లేరు అనేది వాస్తవం.