సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా మొదటి మూడు నాలుగు రోజుల్లోనే 50కోట్లకి పైగా వసూలు చేసే స్టార్స్ చిత్రాల విషయంలో ఇప్పుడు అందరు జాగ్రత్త పడుతున్నారు. 'ఫిదా, అర్జున్‌రెడ్డి, తొలిప్రేమ, అ' వంటి చిన్న చిత్రాలు, విభిన్న చిత్రాలైతేనే ఫ్లాప్ అయిన తక్కువ నష్టాలతో బయటపడవచ్చని, విభిన్న చిత్రాలైతే ఓవర్‌సీస్‌లో బాగా కలెక్షన్లు వసూలు చేస్తాయని, వైవిధ్యం ఉంటే శాటిలైట్ వంటివి కూడా బాగా ధర పలుకుతాయని దాంతో సేఫ్ కావచ్చని భావిస్తున్నారు. పవన్ 'సర్దార్‌గబ్బర్‌సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి', మహేష్ 'బ్రహ్మూెత్సవం, స్పైడర్'లతో ఈ భావన మరింతగా పెరిగింది. అలాంటిది మాస్‌మహారాజా రవితేజ విషయంలో మాత్రం చక్కర్లు చేస్తోన్న ఓ వార్త నమ్మశక్యంగా కనిపించడం లేదు.
'బెంగాల్‌టైగర్' తర్వాత ఎంతో గ్యాప్ ఇచ్చి చేసిన 'రాజా ది గ్రేట్' చిత్రం నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్ రావిపూడిల వల్లనే, వారి గుడ్ విల్ కారణంగానే లాభాలు తెచ్చిపెట్టింది. ఇక రవితేజ తర్వాత నటించిన 'టచ్ చేసి చూడు' చిత్రం కనీస ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేదు. నాగశౌర్య 'ఛలో' చిత్రం పోటీని కూడా తట్టుకోలేకపోయింది. అయినా రవితేజ మాత్రం ప్రయోగాలు చేయను. నా తరహా చిత్రాలే చేస్తానని చెబుతున్నాడు. ప్రస్తుతం ఆయన 'సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుకచూద్దాం' వంటి రెండు సూపర్‌హిట్స్ కొట్టిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టిక్కెట్' అనే చిత్రం చేస్తున్నాడు.
బహుశా టైటిల్‌ని చూస్తే ఇది కూడా రవితేజ మార్క్ చిత్రమే అనిపిస్తోంది. కానీ ఈ చిత్రం శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ హక్కులను అప్పుడే సన్ నెట్‌వర్క్ సంస్థ 25కోట్లకి కొనుగోలు చేసిందని, థియేట్రికల్ బిజినెస్, ఆడియో వంటివి కలుపుకుంటే 60కోట్లు వస్తాయని వార్తలు వస్తున్నాయి. ఇది నమ్మశక్యంగా లేదు. కొంత ఏమైనా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉందంటే అది దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ వల్లనే అని చెప్పాలి.