స్వేచ్చ, స్వాతంత్య్రాలు ఉండవచ్చు గానీ అది మితిమీరి వింత పోకడలు పోతే ఏమవుతుందో త్వరలో వర్మకి స్వయంగా అనుభవంలోకి రానుందని అంటున్నారు. తానో సెలబ్రిటీని కాబట్టి తననెవ్వరూ ఏమీ చేయలేరని, చివరకు డ్రగ్స్ కేసులో కూడా అధికారులను నిందించిన వర్మకి ఇప్పుడు 'జీఎస్టీ' ముప్పు తప్పేట్లు లేవు. ఇది సినిమా కాదని, కేవలం ఆర్ట్‌ఫిల్మ్ అని వర్మ వాదిస్తున్నాడు. అందునా ఇది మన దేశంలో తీసింది కాదు కాబట్టి ఇక్కడి చట్టాలు తనకు వర్తించవనే వింత వాదన చేస్తున్నాడు. మరోవైపు ఈయన మొబైల్ ఫోన్స్‌ని, ల్యాప్‌టాప్‌లను పోలీసులు సీజ్ చేశారు. ఇందులో నుంచి కీలక వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. అసలు మియాకి ఎంత పారితోషికం ఇచ్చావు? దీనిని వెబ్‌సైట్‌కి ఎంతకి అమ్మావు? ఖర్చులు ఎవరు భరించారు? ఎవరి ఖాతాల నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి? దీని ద్వారా వచ్చిన డబ్బులు ఎవరి ఖాతాలో జమ అయ్యాయి? సామాజిక వేత్త దేవితో పోర్న్ సినిమా తీస్తానని ఎలా అన్నావు? ఇలాంటి వాటికి ఐటి యాక్ట్ ఒప్పుకోదని మీకు తెలియదా? ఇండియన్ పౌరుడు ఏ దేశంలో తప్పు చేసినా కూడా మన దేశంలో శిక్ష విధించవచ్చని మీకు తెలియదా? ఇలా పలుకోణాలలో వర్మని ప్రశ్నించిన పోలీసులు ఆయన విషయంలో ఆధారాలు సేకరిస్తామని అంటున్నారు.
వర్మ సెలబ్రిటీ అయినంత మాత్రాన సరిపోదని, సాధారణ నిందతుడిని పరిగణించినట్లుగానే వర్మని పరిగణిస్తామని పోలీసులు అంటున్నారు. ఈ విషయం చిన్నదిగా భావించవద్దని, నేరం రుజువైతే రెండేళ్ల నుంచి ఏడేళ్ల కఠిన జైలు శిక్ష తప్పదని తెలుస్తోంది. ఇక విచారణ సందర్భంగా కూడా తాను హాజరవుతున్న ఫొటోని పోస్ట్ చేస్తూ వర్మ వ్యంగ్యంగా స్పందించాడు. తాను పోలీస్ అధికారిలా ఫీలయి విచారణకు హాజరవుతున్నానని, దర్శకులు దయచేసి తనకు సినిమాలలో వేషాలు ఇవ్వాలని కోరాడు. దాంతో ఆయన ప్రియశిష్యుడైన పూరీ.. సార్ స్క్రిప్ట్ రెడీ.. కేవలం మీ డేట్స్ కోసమే వెయింటింగ్ అంటూ స్పందించాడు. దానికి వర్మ థ్యాంక్స్ చెప్పాడు.
ఇక వర్మ తానెప్పుడు ఎవ్వరికీ ఏ విషయంలో కూడా సారీ చెప్పనని చెప్పిన ఆయన జీఎస్టీ చర్చ సందర్భంగా మణి అనే మహిళను గూర్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దానికి వర్మ సారీ చెప్పాడు. తాను ఎక్కువగా వ్యంగ్యంగా మాట్లాడుతానని, దాంతో అలా తెలియక మాట్లాడి ఉండవచ్చని, ఆమెకు సారీ చెబుతున్నానని దిగి వచ్చాడు. కానీ ఆ మహిళ మాత్రం వర్మను క్షమాపణలతో తాను వదిలేది లేదని, చట్టం ప్రకారం ఆయనకు శిక్ష పడాల్సిందేనని వ్యాఖ్యానించింది. 'సత్యమేవ జయతే'ని 'సత్యమియా జయతే'గా మార్చిన వర్మ ఈ సారి మాత్రం తేలిగ్గా తప్పించుకునే అవకాశం లేదనే చెప్పాలి.