నాడు చిరంజీవి ఎంతో ఇమేజ్ ఉన్న సుప్రీమ్ హీరో. మెగా హీరోగా మారుతున్న సమయంలో ఆయన్ని హీరోగా తీసుకుని మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల ఆధారంగా హాస్యబ్రహ్మ జంధ్యాల 'చంటబ్బాయ్' అనే చిత్రం తీశాడు. ఈ చిత్రం 1986లో వచ్చింది. సుహాసిని, సుత్తివేలు వంటి వారు నటించిన ఈ చిత్రం ఓ కామెడీ డిటెక్టివ్ కథగా సాగుతుంది. నిజమైన వారసుడికి ఆస్తిని ఇచ్చే క్రమంలో ఎవరు అసలైన వారసుడు అని కనుగొనే ప్రయత్నంలోంచి పుట్టిన హాస్యం ఈ చిత్రానికి హైలైట్. నిజానికి చిరంజీవిలోని కామెడీ కోణాన్ని ఇంత అద్భుతంగా జంధ్యాలలా చూపించిన దర్శకుడు మరలా పుట్టలేదు. ముఖ్యంగా ఇందులోని ఓ పాటలో చిరంజీవి చేత లేడీ గెటప్ నుంచి ఎన్నో గెటప్స్ వేయించి, సుహాసినిని టీజ్ చేసే సాంగ్ ఎవ్వరూ మర్చిపోలేరు.
కానీ ఒకానొక సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ, ఆ సినిమా పెద్దగా హిట్ కాకపోవడంతోనే తాను ఆ తరహా క్లాస్ కామెడీని చేయకుండా మాస్ కామెడీపైనే దృష్టి పెట్టానని చెప్పాడు. కానీ నిజానికి ఈ చిత్రం నాటి ప్రేక్షకులకు నేటికి కూడా గుర్తుండి పోయిందంటే ఆ చిత్రం ఎంత క్లాసికో అర్ధమవుతుంది. కమర్షియల్‌గా కూడా ఈ చిత్రం బాగానే వర్కౌట్ అయినా కూడా చిరుకి మాత్రం ఈ చిత్రం సంతృప్తిని ఇవ్వలేదు. అయినా చిరంజీవి నటించిన క్లాసిక్స్‌లో 'రుద్రవీణ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు, ఆరాధన, ఇద్దరు మిత్రులు, డాడీ, తొలినాళ్లలో చేసిన పున్నమి నాగు' వంటి వాటితో పాటు చంటబ్బాయ్ కూడా ఒకటి.
ఇక నాడు చిరంజీవిలా నేడు నేచురల్‌స్టార్ నాని కూడా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్‌గా ఎదిగాడు. ఈయన్ను తాజాగా ఏ రీమేక్‌లో నటించాలని ఉంది అని అడిగితే ఠక్కున చిరంజీవి-జంధ్యాలల 'చంటబ్బాయ్' రీమేక్‌లో నటించాలని ఉందని చెప్పాడు. ఇక నేటి మెగా హీరోలలో ఎవ్వరూ ఆ చిత్రానికి సరిపోరు. కేవలం నాని మాత్రమే పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతాడని అంటున్నారు. మొత్తానికి ఈ రీమేక్‌ని నాని చేస్తే చూడాలని అందరికీ ఉంది. మొత్తానికి నాని టేస్ట్ అందరికంటే భిన్నమని ఈ ఒక్క విషయంతోనే తేలిపోయింది.