నేడు ప్రతి ఒక్కరు సినిమాలలో వారసత్వం పెరిగిపోతోంది. బ్యాగ్రౌండ్‌ని చూసే అవకాశాలు ఇస్తున్నారు. సుదీర్ఘ అనుభవం కలిగిన వారికే పెద్ద పీట వేస్తున్నారు అని చెబుతున్నారే గానీ తమ వంతు వచ్చే సరికి వారు కూడా అవే క్వాలిఫికేషన్స్‌గా తీసుకుంటున్నారు. దీంతో మాటలు చెప్పేవారే గానీ నిజంగా చేతల్లో చూపించే వారు ఎవ్వరూ లేరనే నిర్ణయానికి టాలెంటెడ్ యంగ్ దర్శకులు వచ్చేశారు. ఇక ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన రవితేజ వంటి వారు కూడా రాబోయే తరాలకు కర్చీఫ్ వేస్తూ తమ కుమారుడిని బాలనటునిగా పరిచయం చేశారు. ఇలా ఎలాంటి గొప్ప నేపధ్యం లేకుండా నానా కష్టాలు పడి పైకి వచ్చిన వారు కూడా ఇతరుల నేపధ్యం గురించే ఆలోచిస్తున్న సమయంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన నేచురల్ స్టార్ నాని మాత్రం టాలెంట్ ఉన్న వారికి ఓ స్వీట్ న్యూస్ చెప్పాడు.
గతంలో 'డి ఫర్ దోపిడి' చిత్రానికి లాస్ట్ టైంలో ఎంటరై, కేవలం కొద్దిపాటి భాగస్వామ్యమే చేసిన నాని ప్రస్తుతం పూర్తి నిర్మాతగా మారి ప్రశాంత్ వర్మ అనే నూతన దర్శకుడిని నమ్మి, తానే నిర్మాతగా, తనకున్న పరిచయాలలో కాజల్, రెజీనా, నిత్యామీనన్, ఈషా హెబ్బా, ప్రియదర్శి, శ్రీనివాస్ అవసరాల, మురళీశర్మ వంటి భారీతారాగణంతో 'అ' చిత్రం నిర్మించాడు. ఇక ఇందులో చేపకి తాను వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాకుండా రవితేజతో కూడా వాయిస్ ఓవర్ ఇప్పించాడు. ఈ చిత్రం విడుదల సందర్భంగా నాని మాట్లాడుతూ, ఇక నుంచి నిర్మాతగా వరుస చిత్రాలు చేస్తాను.. ఎలాంటి బ్యాగ్రౌండ్, అనుభవంతో సంబంధం లేకుండా టాలెంట్, కంటెంట్ మీద నమ్మకంతోనే చిత్రాలు నిర్మిస్తాను. 'అ' చిత్రం ఇప్పుడే చూశాను. దర్శకుడు ప్రశాంత్ వర్మ గొప్పగా తీశాడు. నేను సొంతంగా నిర్మించే చిత్రాలలో నేను నటించను. కేవలం నిర్మాణం మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఓ తీపి కబురుని టాలెంట్ ఉన్న వారికి వినిపించాడు.
ఇక ఇటీవల బన్నీవాసు, జ్ఞానవేల్ రాజా వంటి వారు కూడా వి4 క్రియేషన్స్‌ని పెట్టి యువతరాన్ని ప్రోత్సహిస్తామని చెప్పి ఈటీవీ ప్రభాకర్ దర్శకత్వంలో 'నెక్ట్స్ నువ్వే' చిత్రం చేసిన తర్వాత మరోసారి ఆ మాటను కూడా ఎత్తకపోవడం తెలిసిందే. మరి ఈ విషయంలో నాని అయినా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.