తెలుగుసినీ కపుల్స్‌లో శుభలేఖ సుధాకర్, ఎస్పీ శైలజల జంట కూడా ఒకరు. ఇక శుభలేఖ సుధాకర్ తన నటనతో మెప్పించి మొదటి చిత్రం టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకుంటే పెళ్లయినా కూడా ఎస్పీశైలజగానే ఈ గాన కోకిల పయనం సాగుతోంది. ఇక ఓ సారి శైలజ అన్నయ్య, గాన గంధర్వుడు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం దర్శకుడు జంధ్యాలతో మా చెల్లెలికి పెళ్లి చేయాలనుకుంటున్నామని చెప్పడం, దాంతో జంధ్యాల శుభలేఖ సుధాకర్ పేరును ప్రస్తావించడం జరిగాయి. ఇక వైజాగ్‌లో సుధాకర్‌తండ్రి ఓ పాట కచ్చేరి ఏర్పాటు చేయగా, శైలజ ఆ కచ్చేరిలో పాట పాడింది. అప్పుడు సుధాకర్ శైలజని మొదటి సారిగా చూశాడు. ఆ తర్వాత కె.విశ్వనాథ్ కూతురి వివాహంలో మరింత దగ్గరగా చూశాడు. వీరికి శ్రీకర్ అనే అబ్బాయి ఉన్నాడు. పిల్లాడు పుట్టిన తర్వాత తిరుమల వెళ్లితే వాళ్ల బాబు దోగాడుకుంటూ వేంకటేశ్వరస్వామి విగ్రహం వద్దకు వెళ్లడంతో వేంకటేశ్వరస్వామి పేరు వచ్చేలా శ్రీకర్ అనిపేరు పెట్టారు.
ఇక శుభలేఖ సుధాకర్ శైలజని 'నిండు కుండ, తొణకదు, ఎస్పీ బాలు లెజెండ్, సినిమాలు ప్యాషన్, మద్యం నా ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ , గర్ల్‌ఫ్రెండ్ అని, టీవీ తనకు అన్నం పెట్టింది అంటాడు'. శైలజ మాట్లాడుతూ.. 'సుధాకర్ మంచి ఫ్రెండ్, బాలు తండ్రి తర్వాత తండ్రి, పాట నా ప్రాణం, డబ్బింగ్ మలుపు, డబ్బులు ఎంత వరకు అవసరమో అంత వరకు అని చెప్పుకొచ్చింది'. ఈమె తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం కలిపి 6వేలకు పైగా పాటలను పాడింది. 'సాగరసంగమం' సమయంలో ఈమె నాట్యంలో అరంగేట్రం చేసింది. అది చూసిన విశ్వనాథ్, ఏడిద నాగేశ్వరరావులు ఆమెని ఆ చిత్రంలో పెట్టుకోవాలని భావించారు. కానీ శైలజ నో చెప్పింది. దాంతో మరో అమ్మాయిని చూసుకుని హిమబిందు అని పేరు పెట్టారు. కానీ విశ్వనాథ్‌కి మాత్రం శైలజ చేత చేయించాలని కోరిక. చివరకు ఆమె నటించే పాటకు ఆమెనే పాడిస్తే ఓకే అని శైలజ సోదరుడు బాలు, ఆమె తండ్రి ఒప్పుకున్నారు. ఇక శైలజ బాలుతో కలిసి విదేశాలకు వెళ్లినప్పుడు ఆయన కోసం విదేశీ మద్యం తెస్తుందట. అందరు అవి ఆమె తాగడానికే అని భావిస్తారని కానీ అవి సుధాకర్ కోసమేనని చెప్పింది.
ఇక 'పట్నం వచ్చిన పతివ్రతలు'లో రాధికకు 'వసంత కోకిల'లలో శ్రీదేవికి శైలజ డబ్బింగ్ చెప్పింది. అమాయకంగా ఉండే సుధాకర్‌లో ఇలాంటి నటుడు ఉన్నాడా? అని ద్రోహి చిత్రం చూస్తే అర్ధమైందట. ఇక తాము విడిపోయామని వార్తలు వచ్చాయని, కానీ అవి మాపై ప్రభావం చూపకపోయిన తమ బంధువులపై మాత్రం అది బలంగా పడింది. శైలజ డెలివరీ సమయంలో వీరికి అవకాశాలు రాక కేవలం చేతిలో 500లు ఉంటే దానితోనే గడుపుకున్నారు తప్ప ఎవ్వరినీ అడగలేదని వారు చెప్పుకొచ్చారు.