'మెర్శల్' చిత్రంతో భారీ విజయం సొంతం చేసుకున్న విజయ్ 'స్పైడర్'తో డిజాస్టర్ అందుకున్న ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌తో కలిసి 'తుపాకి, కత్తి' తర్వాత హ్యాట్రిక్ మూవీ చేస్తున్నాడు. లైకా ప్రోడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ 'దళపతి 62' చిత్రం షూటింగ్ ప్రస్తుతం కోల్‌కత్తాలో జరుగుతోంది. ఇందులోని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను ఫైట్ మాష్టర్ రామ్-లక్ష్మణ్‌లు చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలకు సిద్దమవుతోంది. ఇక మరోవైపు స్టార్ అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న నాలుగో చిత్రం 'విశ్వాసం' కూడా దీపావళికే విడుదల కానుంది. మురుగదాస్ చిత్రం తర్వాత విజయ్ మరోసారి 'తేరి, మెర్శల్' చిత్రాల దర్శకుడు అట్లీతో ఓ చిత్రం. దాని తర్వాత ఇటీవల కార్తి హీరోగా 'ఖాకీ' చిత్రం తీసిన దర్శకుడు వినోద్‌తో మరో చిత్రం చేయనున్నాడని కోలీవుడ్ మీడియా అంటోంది.
ఇక విజయ్-మురుగదాస్‌ల చిత్రంలో కీర్తిసురేష్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇందులో తెలుగులో అక్కినేని అఖిల్-వినాయక్‌ల కాంబినేషన్‌లో రూపొందిన 'అఖిల్' చిత్రం ద్వారా పరిచయమైన సాయేషా సైగల్ కూడా నటించనుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె మూడు తమిళ చిత్రాలలో బిజీగా ఉంది. అయితే ఈ వార్తలను సాయేషా సైగల్ ఖండించింది. తాను ఆ చిత్రంలో నటించడం లేదని, అసలు ఆ చిత్రంలో నటించమని తనను ఎవ్వరూ సంప్రదించలేదని ఆమె తెలిపింది.