మొత్తానికీ హీరోయిన్ కావాలని కలలు కనిన ఘట్టమనేని మంజుల దర్శకురాలిగా మారి తన మొదటి చిత్రంగా సందీప్‌కిషన్, అమైరా దస్తూర్, త్రిధా చౌదరిలతో తీసిన 'మనసుకు నచ్చింది' అనే చిత్రం గురించి, తన దర్శకత్వ ప్రతిభ కోసం నానా గొప్పలు పోతోంది. తన చిత్రం చూసి నచ్చనివారు వేస్ట్‌ఫెలోస్ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పలు దుమారాన్నే రేపాయి. నేడు కొత్తగా వస్తున్న దర్శకులు, హీరోలు ఇలాంటి అర్జున్‌రెడ్డి యాటిట్యూడ్ ద్వారా వార్తల్లో నిలవాలని, తమ చిత్రానికి ప్రమోషన్‌లా వాడుకోవాలని చూస్తుండటం కాస్త ప్రమాదకరం. ఇక ఈ చిత్రం 16 తేదీన విడుదల కానుండగా, అదే రోజు నాని నిర్మాతగా రూపొందిన మరింత విభిన్నమైన చిత్రం 'అ' చిత్రం విడుదల కానుండటం విశేషం.
ఇక మంజుల మాట్లాడుతూ, తాను పవన్ కోసం ఓ కథ రాశానని, ఆయన తన కథ వింటే ఎంతో ఎగ్జైట్ అయి తన సినిమాలో నటిస్తాడని చెప్పి ఈ విషయాన్ని పవన్‌కి చెప్పాలని కూడా మీడియాని కోరింది. తాజాగా ఆమె తాను పవన్ కోసం రాసుకున్న కథ లైనేమిటో చెప్పేసింది. సినిమాలలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఓ స్టార్ హీరో, సినిమాలను వదిలి, ప్రజల కోసం ప్రజాసేవకి అంకితం అయితే ఎలా ఉంటుంది? అనే పాయింట్ ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని తెలిపింది. ఇక తన సోదరుడు మహేష్‌బాబుతో చిత్రం చేయడం తన కల అని చెప్పిన ఈమె మహేష్ తనంతట తాను పిలిచి దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తే మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈమె తీసిన 'మనసుకు నచ్చింది' చిత్రం దర్శకురాలిగా ఈమెకి ఎంత పేరును తీసుకుని వస్తుందో వేచిచూడాల్సివుంది.