నాడు పవన్‌కళ్యాణ్ నటించిన 'తొలిప్రేమ' చిత్రం విడుదలైనప్పుడు ఇండస్ట్రీ అంతా ఆ దర్శకుడు కరుణాకరన్ గురించే మాట్లాడుకున్నారు. ఆ స్థాయిలో కాకపోయిన ఇప్పుడు తాజాగా వరుణ్‌తేజ్ హీరోగా వచ్చిన 'తొలిప్రేమ' చిత్రం తర్వాత కూడా అందరూ ఈ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి ఎవరనే విషయమే మాట్లాడుకుంటున్నారు. ఈయన 'జ్ఞాపకం, స్నేహగీతం' చిత్రాలలో నటించాడు. ఆ తర్వాత 'ఇట్స్‌మై లవ్‌స్టోరీ, స్నేహగీతం, కేరింత' చిత్రాలకు రచయితగా పని చేశాడు. నేటి రోజుల్లో రచయితలు నటులుగా మారుతుండటంతో నిజంగానే ఇండస్ట్రీలో రచయితల కొరత ఏర్పడింది. ఇలాంటి సమయంలో నటుడైనా ఓ వ్యక్తి రచయితగా, దర్శకుడిగా మారడం విశేషం. ఇక ఈయన రచన, దర్శకత్వం, నటన ఈ మూడింటిలో ఏది ఎంచుకోవాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు రచయిత కమ్ డైరెక్టర్‌కే ఓటు వేశాడు. ఇక 'తొలిప్రేమ' చిత్రం కథ రాసుకున్నప్పుడు 'ముకుందా' చిత్రం రిలీజైంది. ఇలాంటి హీరో నా చిత్రంలో ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. తర్వాత 'కంచె' చిత్రం చూసిన తర్వాత వరుణ్‌తేజ్ అయితే ఏ పాత్ర అయినా చేయగలడని భావించాను. 'లోఫర్' చిత్రం సమయంలో వరుణ్‌తేజ్‌కి కథ చెప్పి ఓకే చేయించుకున్నాను.
మొదట దిల్‌రాజు బేనర్‌లో ఈ చిత్రం చేయాలని భావించాను. కానీ దిల్‌రాజు పలు ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉండటంతో ఆయన నుంచి అనుమతి తీసుకుని నిర్మాత బి.వి.ఎస్,ఎన్. ప్రసాద్‌ని కలిశాను. ఆయన కుమారుడు బాపినీడుతో మంచి స్నేహం ఉండటంతో ఈ చిత్రం ఓకే అయింది. 'ఫిదా' చిత్రం తర్వాత కూడా తన కథలో ఏమీ మార్పులు చేయలేదట. ఇక ఈ చిత్రం చూసిన వెంటనే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఫోన్ చేసి అభినందించారు. తెలుగు సినిమాకి సంబంధించి ఆయన షో మ్యాన్. ఆయన నుంచి కాంప్లిమెంట్‌ని అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక ఆర్.నారాయణమూర్తి, కేటీఆర్‌ల అభినందనలు కూడా మర్చిపోలేను. 'ఫిదా' చిత్రం విడుదలైన 10రోజులకు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాం. తమన్ తన సొంత చిత్రంగా భావించి మ్యూజిక్ అందించారు. మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలను, వరుణ్‌తేజ్, రాశిఖన్నాలు ఎంతో బాగా చేశారు.
ఈ చిత్రానికి 'తొలిప్రేమ' అని టైటిల్ పెట్టినప్పుడు ఫ్యాన్స్ నుంచి ఏమైనా కామెంట్స్ వస్తాయని భావించాను. టైటిల్ పెట్టావ్.. బాగా తీయమని సూచించారు. అంతేగానీ ఆ టైటిల్‌ని ఎందుకు పెట్టావ్? అని ఎవ్వరూ అనలేదు. పవన్ 'తొలిప్రేమ' స్థాయిలో కాకపోయినా ఆ పేరును చెడగొట్టకుండా తీసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. తదుపరి బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ గారితోనే మరో చిత్రం, దిల్‌రాజుగారితో ఓ చిత్రం చేయనున్నానని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చాడు.