నాగ చైతన్య - సమంతతో కలిసి 'ఏ మాయ చేసావే, ఆటో నగర్ సూర్య, మనం' వంటి సినిమాల్లో చెయ్యడం కాదు... నిజంగా వీరిద్దరూ రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకుని భార్య భర్తలయ్యారు. ఏ మాయ చేసావే అప్పటి నుండే మంచి ఫ్రెండ్స్ అయిన వీరిద్దరూ మనం సినిమా అప్పటికి పీకల్లోతు ప్రేమలో మునిగి గత ఏడాది అక్టోబర్ లో ఒక్కటయ్యారు. అక్కినేని ఇంటి కోడలిగా తన బాధ్యతలు నిర్వహిస్తూ ససినిమాల్లో బిజీ అయిన సమంత ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ సినిమా షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. మరోపక్క నాగ చైతన్య సవ్యసాచి, మారుతీ దర్శకత్వంలో సినిమా షూటింగ్స్ తో ఎవరి పనులు వారు చేసుకుంటూ బిజీగా ఉన్నారు.
అయితే వీరిద్దరూ పెళ్ళికి ముందు కలిసి నటించినట్టే పెళ్లి తర్వాత కూడా కలిసి నటిస్తే.... బావుంటుందని కొంతమంది దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అయితే దర్శకుడు మారుతీ... తాను తెరకెక్కించబోయే సినిమాలో నాగ చైతన్య పక్కన హీరోయిన్ గా సమంతతో తన సినిమాలో చేయించాలని భావించాడు. కానీ అప్పట్లో అది కుదరలేదు. అయితే ఇప్పుడు నాగ చైతన్య - సమంత జంట ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ చేయబోతున్నారనే ప్రచారం మొదలైంది. కేవలం ప్రచారమే కాదు నిజమనే అంటున్నారు. కోన వెంకట్ ఈ మధ్యన రైటర్ గా ఉంటూనే నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్నాడు. తాజాగా కోన వెంకట్ దర్శకుడు శివ నిర్వాణా దర్శకత్వంలో డి వి వి దానయ్యలతో కలిసి నిర్మించిన నిన్ను కోరి హిట్ కూడా అయ్యింది. మళ్ళీ ఇదే కాంబోలో నాగ చైతన్య - సమంత జంటగా మరో సినిమాని నిర్మించడానికి సమాయత్తమవుతున్నాడట కోన వెంకట్.
హీరోగా నాగ చైతన్యని తీసుకున్న వీరు... సమంతని హీరోయిన్ గా సెలెక్ట్ చెయ్యడమే కాదు ఇప్పటికే సమంతకి కథని వినిపించి ఓకె చేయించుకున్నారని టాక్ నడుస్తుంది. ఇక కథ, అందులోని తన పాత్ర కూడా నచ్చడంతో సమంత వెంటనే ఒప్పుకుందంటున్నారు. చైతు నటించే సవ్యసాచి, మారుతీ సినిమా కంప్లీట్ కాగానే శివ నిర్వాణా డైరెక్షన్ లో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు.