అక్కినేని అఖిల్ నటించిన 'హలో' చిత్రం మంచి టాక్‌నే సాధించినా కూడా ఆర్ధికంగా హిట్టు కాలేదు. దాంతో మొదటి చిత్రం 'అఖిల్'కి రెండో చిత్రం 'హలో'కి మధ్య రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న అక్కినేని అఖిల్ తన తదుపరి చిత్రం గురించి జనవరి 10వ తేదీన అనౌన్స్ చేస్తానని ప్రకటించాడు. నెల గడిచిపోయినా కూడా ఈయన తన తదుపరి చిత్రం విషయంలో ఇంకా నిర్ణయానికి రాలేకపోతున్నాడు. మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నించిన 'అఖిల్', క్లాస్‌ని మెప్పించాలని భావించిన 'హలో' చిత్రాలు రెండు కూడా ప్రజల నుంచి ఆదరణ పొందడంలో విఫలం కావడంతో తదుపరి చిత్రం విషయంలో ఆయన డైలమాలో ఉన్నాడు.
ఇక ఇందులో నటించిన హీరోయిన్ కళ్యాణిప్రియదర్శన్ కూడా మంచి గుర్తింపునే తెచ్చుకున్నా అవకాశాలు అందుకోవడంలో వెనుకబడింది. దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజిల కుమార్తె అయిన ఈమెకి తాజాగా ఓ చాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో ఆమె యంగ్‌హీరో శర్వానంద్ సరసన నటించనుంది. సుధీర్‌వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇది మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. ఇందులో 40ఏళ్ల వయసున్న పాత్రలో కూడా శర్వానంద్ కనిపించనున్నాడు.
మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సివుంది. తనకు చిన్ననాటి నుంచి మాఫియా, అండర్ వరల్డ్ చిత్రాలలో నటించాలనేది కోరిక అని, ఆ కోరిక ఇంత త్వరగా నెరవేరుతుండటం తనకెంతో ఆనందాన్ని ఇస్తోందని కళ్యాణిప్రియదర్శన్ అంటోంది. మార్చి మూడవ వారంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.