తమిళనాడు రాజకీయాలు వేడిగా తయారయ్యాయి. రజనీకాంత్, కమల్‌హాసన్‌లు రాజకీయాలలోకి వస్తామని చెప్పారే గానీ ఇంకా విధివిధానాలు, పార్టీ పేర్లు, చిహ్నాలు వంటివి ప్రకటించలేదు. ఇక రజనీ అభిమానులు తమ అభిమాన సంఘాలను ప్రజాసంఘాలుగా మార్చి ప్రజలను పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మందిని పార్టీలో చేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా మహిళలకు తొలి ప్రాధాన్యం ఇవ్వమని రజనీ అదేశించారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలలో పోటీ చేస్తామని రజనీ ప్రకటించాడు.
ఇక త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే ఏడాది రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయాన్ని సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తానని రజనీకాంత్ స్పష్టం చేశాడు. మరోవైపు రజనీకాంత్, కమల్‌హాసన్‌లు కలసి పోటీ చేయడంపై కూడా తీవ్ర చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో అభిమానం ప్రాతిపదికన తీసుకుంటే కమల్‌హసన్ కంటే రజనీకాంత్‌కే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. రజనీ అభిమానులు మాట్లాడుతూ, రజనీ ఎంతో తెలివైన వారు. తనకు నటునిగా జన్మనిచ్చిన తమిళనాడుకు, ఇక్కడి ప్రజలకు ఆయన ఏదో సేవ చేయాలని భావిస్తున్నాడు.
ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని అంటున్నారు. ఇక కొన్ని ప్రాంతాలలో సభ్యత్వ నమోదును కూడా రజనీ అనుచరులు పూర్తి చేశారు. మరి స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికల్లో రజనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది వేచిచూడాల్సివుంది...!