తెలుగులో ఆ సీనియర్ నటుడికి పెద్దగా అవకాశాలు, పేరు రాలేదు. కానీ అతను కేవలం తన తీక్షణమైన చూపులతోనే విలనిజాన్ని పండించడంలో బహుపేరు తెచ్చుకున్నాడు. చాలా ఏళ్ల కిందట వచ్చిన 'నల్లత్రాచు' సినిమా సంచలన విజయం సాధించింది. అందులో ఇతను వినోద్ అనే మరో సీనియర్ నటుడితో కలసి ఫుల్ లెంగ్త్ విలన్ పాత్రను పోషించి మెప్పించాడు. ఆ తర్వాత కృష్ణవంశీతో పాటు పలువురి చిత్రాలలో తనదైన కామెడీ టైమింగ్‌ని, విలనిజాన్ని చూపించే పాత్రల్లో మెప్పించాడు. ఆయనే బెనర్జీ.
ఈయన తాజాగా మాట్లాడుతూ, నాకు సావిత్రి గారితో పనిచేసే అదృష్టం లభించింది. అది నా మొదటి చిత్రం 'హరిశ్చంద్రుడు' అనే సోషల్ డ్రామా మూవీ అది. ప్రభాకర్‌రెడ్డి, సావిత్రిలు నటించారు. విశ్వేశ్వరరావు ఈ చిత్ర దర్శకుడు. ఈ చిత్రానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గానే కాదు ఓ పాత్రలో కూడా నటించాను. ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆమెతో బాగా మాట్లాడే వాడిని. సావిత్రి గారు ఎంతో మంచివారు. ఆమె చిత్రానికి అసిస్టెంట్‌గా చేయడం, ఆమె చిత్రంలో నటించడం నిజంగా నా అదృష్టం. ఆమెని సెట్లో చూస్తున్నంత సేపు ఎంతో బాధ వేసేది. ఎందుకంటే ఆమె అప్పటికే బాగా పాడైపోయారు.
నేను సినిమాలలోకి రాక ముందు నుంచి ఆమెని చూస్తూ వచ్చినవాడిని, ఆ తర్వాత కాలంలో శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక వంటి వారితో కూడా కలిసి నటించాను అని చెప్పుకొచ్చాడు. ఇక తెలుగులో 'నాలుగు స్తంభాలాట, ముద్దమందారం' వంటి చిత్రాలలో నటించిన పూర్ణిమ కూడా సావిత్రి నటించిన ఈ 'హరిశ్చంద్రుడు' చిత్రంలో నటించడం విశేషం.