పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన 'అజ్ఞాతవాసి' సినిమాతో గట్టిగా అంటే కోలుకోలేని విధంగా దెబ్బతిన్న త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ విషయంలో మాత్రం బాగా శ్రద్ద పెడుతున్నాడట. 'అజ్ఞాతవాసి' ఫెయిల్యూర్ కి కేవలం త్రివిక్రమ్ నే అందరు తప్పుబట్టారు. మరి 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత తన మీద అంచనాలు తగ్గకుండా ఎన్టీఆర్ స్క్రిప్ట్ ని సిద్ధం చెయ్యడమే కాదు.. స్క్రిప్ట్ ని రీరైట్ చేస్తున్నాడట. అలాగే కథలోని మార్పులు చేర్పులను కూడా ఎన్టీఆర్ సమక్షంలోనే చేసి.. ఓకే చేయించుకుంటున్నాడనే టాక్ వినబడుతుంది. సాధారణంగా కథ చర్చల్లోకి హీరోలను ఇన్వాల్వ్ చేసే మనస్తత్వం కాదు దర్శకుడు త్రివిక్రమ్ ది.
కానీ ఈసారి త్రివిక్రమ్ తన పంథా మార్చుకుని కథలోని మార్పులు చేర్పులని ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ కి వివరిస్తూ ఎన్టీఆర్ ఫైనల్ చేశాకే ఆ కథని ఫైనల్ చేసినట్లుగా చెబుతున్నారు. మరి ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ మీద పూర్తి నమ్మకం ఉన్నప్పటికీ త్రివిక్రమ్ మాత్రం 'అజ్ఞాతవాసి' ఫెయిల్యూర్ తో ఛాన్స్ తీసుకోవాలనుకోవడం లేదట. అసలు కథలో ఎలాంటి మార్పులు చేసినా తనదాకా తీసుకురావాల్సిన అవసరంలేదని త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ ఎంత చెప్పినా త్రివిక్రమ్ వినడం లేదట. మీకెలా అనిపిస్తే అలా చెయ్యమని తారక్.. త్రివిక్రమ్ కి చెప్పినా వినడంలేదంటే.. త్రివిక్రమ్ ఎంతగా ఎన్టీఆర్ సినిమా కథ విషయంలో జాగ్రత్త పడుతున్నాడో అర్ధమవుతుంది.
ఇక ఇప్పటికే త్రివిక్రమ్, ఎన్టీఆర్ కి సంబంధించి పూర్తి కథని సిద్ధం చేశాడని.. ఆల్రెడీ త్రివిక్రమ్ డైలాగ్ వెర్షన్ కూడా మొదలు పెట్టేశాడని.. ఇక కేవలం నటీనటుల ఎంపికతో పాటు.. కొద్దిగా ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకుని సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లడమే ఆలస్యం అంటున్నారు. ఇక మార్చ్ నెలలో సెట్స్ మీదకెళ్లే ఈ సినిమాని దసరా నాటికీ విడుదలకు సిద్ధం చేసేలా ప్లాన్ చేస్తున్నారట.