దేశంలో ప్రధాని మోదీ తర్వాత అధికంగా ట్విట్టర్‌లో ఫాలోయర్స్ ఉన్న వ్యక్తిగా బిగ్‌బి అమితాబ్‌కి పేరుంది. ఆయన ఈ విషయంలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఈయన బాలీవుడ్‌కి సంబంధించిన పలువురు ప్రముఖులనే కాదు.. తెలుగు సినీ సెలబ్రిటీలను కూడా ఫాలో అవుతున్నాడని తాజాగా తెలిసింది. ఈ విషయాన్ని రకుల్ ప్రీత్‌సింగ్, వెన్నెల కిషోర్‌లు స్వయంగా తెలిపారు. అమితాబ్‌ని ఇతరులు ఫాలో అవుతారే గానీ తెలుగు సినీ ప్రముఖులను అమితాబ్ ఎందుకు ఫాలో అవుతాడు? అనే సందేహం అందరికీ వచ్చింది.
అయితే ఈ విషయాన్ని బిగ్‌బి తాజాగా నిజమేనని ఒప్పుకున్నాడు. కొందరు అమితాబ్ కేవలం వార్తల్లో ఉండటం కోసమే ఇలా చేస్తున్నాడనే విమర్శలపై తీవ్రంగా స్పందించాడు. తాను ఇతరులను ఫాలో కావడం తప్పా? అదే తప్పైతే నేను లక్షలాది తప్పులు చేయడానికి రెడీగా ఉన్నానని తెలిపాడు. ఇక తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందనే వార్తలను కూడా ఆయన ఖండించారు. తాను ఇష్టపూర్వకంగానే అందరినీ ఫాలో అవుతున్నానని స్పష్టం చేశాడు.
మొత్తానికి ఈ విషయంలో బిగ్‌బి నుంచి సమాధానం రావడంతో దీనిపై వస్తున్న పుకార్లకు ఇకనైనా బ్రేక్ పడతాయో లేదో చూడాలి. ఇక ఈ వయసులో కూడా ఆయన యంగ్ హీరోలకంటే ఎంతో హుషారుగా 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, బ్రహ్మాస్త్ర, 102 నాటౌట్, సైరా.. నరసింహారెడ్డి' చిత్రాలతో పాటు తాజాగా సూర్య హీరోగా నటించే ఓ చిత్రంలో కూడా కీలకపాత్రను పోషించడానికి ఓకే చెప్పాడట.
గతంలో సూర్యతో 'వీడొక్కడే. బ్రదర్స్' చిత్రాలకు దర్శకత్వం వహించిన కెవి ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. ఇలా అందరితో చిత్రాలు చేస్తోన్న బిగ్‌బి.. బాలయ్యకు నో చెప్పడం మాత్రం ఇప్పటికీ ఆశ్చర్యకరమేనని చెప్పాలి.