సాధాణంగా వర్మ పొగుడుతూ చేసే వ్యాఖ్యలు చాలా తక్కువగా ఉంటాయి. ఏదైనా వ్యంగ్యంగా చెప్పడమే ఆయనలోని అసలైన వ్యక్తిని గుర్తు చేస్తుంది. అయితే తాజాగా మాత్రం రాంగోపాల్ వర్మ తలైవా రజనీకాంత్ అభిమానులు గర్వపడి, ఫిదా అయ్యే ట్వీట్ చేశాడు. రజనీకాంత్ రాజకీయ జీవితాన్ని, ఆయన రాబోయే సినిమాని రెండింటికి కలిపి ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆయన ట్వీట్ చేస్తూ, రజనీకాంత్ ఇండియాకి ప్రధానమంత్రి అయితే ఇండియా కూడా అమెరికా సరసన చేరుతుంది. ప్రపంచంలోని 200 దేశాలలో ఇండియా ఒకటి. అదే ఈ దేశానికి రజనీకాంత్ ప్రధాని అయితే ఆయన చిత్రం '2.0'లాగా మన దేశం '2.0' నుంచి '200.0'గా ఎదుగుతుందని చేసిన ట్వీట్ కాస్త అతిశయోక్తిగా ఉన్నా కూడా రజనీ అభిమానులు మురిసిపోయేలా, వర్మ స్టైల్‌లోనే ఉంది.
ఇక ఏదైనా మనసులోకి వస్తే వెంటనే దానికి ట్వీట్ రూపం ఇవ్వడం వర్మ స్పెషల్. ఆయన మస్తిష్కంలో వచ్చే ఆలోచనలు ఎప్పుడు విచిత్రంగానే ఉంటాయి. ఇక తాజాగా ఆయన తనకు వివాహం, చావు నచ్చవని, ఒకటి మనిషి స్వేచ్చను చంపేస్తే మరోటి మనిషి శరీరాన్ని చంపేస్తుందని చెప్పి కాదేదీ ట్వీట్ కనర్హం అన్నట్లుగా చావు, పెళ్లిలను కూడా ఆయన వదలలేదు. ఇక రజనీ పార్టీని ప్రకటించే సమయంలో స్క్రీన్ మీద కంటే ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించాడని చెప్పిన వర్మ గతంలో పవన్ రాజకీయాలను, రజనీ రాజకీయాలను కూడా పోలుస్తూ వైవిధ్యమైన ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే.
నెటిజన్లలో 'జీఎస్టీ' మీద కామెంట్స్ తగ్గుతున్న సమయంలో మరలా వర్మ తలైవా ట్వీట్ ద్వారా నెటిజన్లకు మంచి భోజనమే పెట్టాడని చెప్పవచ్చు. మరి ఈ ట్వీట్ చూసిన తర్వాత మోదీ, రాహుల్‌గాంధీలతో పాటు బిజిపి, కాంగ్రెస్ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూడాల్సివుంది..! మొత్తానికి వర్మ పుణ్యమా అని రజనీకాంత్ దేశ ప్రధాని అయితే ఎలా ఉంటుంది అనే స్వీట్ ఫీలింగ్‌ని ఈ ట్వీట్ కలిగిస్తుందనే చెప్పవచ్చు.