ఒకే చిత్రానికి 30, 40లక్షలు తీసుకునే బదులు ఏడాదికి మూడు నాలుగు చిత్రాలు చేస్తూ 10లక్షలు తీసుకుంటే నిర్మాతలతో పాటు పరిశ్రమకి కూడా శ్రేయస్కరం. హీరోలకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంతకాలం ఇదే రూట్‌ని నాని ఫాలో అయ్యాడు. నాని ఏమీ వారసత్వంగా రాలేదు. ఆయన ఎదుగుదల ఆయనకేమీ పూల పాన్పు కాదు. ఆయనకు దర్శకులు, నిర్మాతలు, సినిమా బిజినెస్, బయ్యర్ల కష్టనష్టాలు అన్ని తెలుసు. అందునా చిన్న స్థాయి నుంచి ఎదిగాడు కాబట్టి అన్ని చూసే ఉంటాడు. ఇక తాజాగా ఆయన కూడా 'అ' చిత్రంతో నిర్మాతగా మారాడు. ఈ చిత్రం వేడుక సందర్భంగా నిర్మాతల టెన్షన్ ఏమిటో తాను స్వయంగా రుచి చూశానని చెబుతున్నాడు.
ఇక నాని నేడు నేచురల్‌స్టార్‌గా ఎదిగి ఉండవచ్చు. కానీ ఆయన ఈ స్థితిలో ఉండటానికి చిన్న, మీడియం చిత్రాల నిర్మాతల ప్రోత్సాహమే కారణం. ఇక ఈయన 'ఎంసీఏ' వరకు ఐదుకోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకునే వాడు. అదే లెక్కలో ఉంటే ఆయన చిన్న, మధ్యతరగతి నిర్మాతలకు బాగా అందుబాటులో ఉంటాడు. కానీ తాజాగా మైత్రిమూవీమేకర్స్ సంస్థ 7కోట్ల వరకు నాని డిమాండ్ చేయవచ్చని భావించిందట. అంటే 5 నుంచి పెంచుకున్నా ఓరెండు కోట్లు పెంచుకుంటే 7కి చేరుతుంది. కానీ నాని మాత్రం 5కి డబుల్ చేసి 10కోట్లు అడగటంతో మైత్రిమూవీమేకర్స్ నిర్మాతలు ఖంగుతిన్నారని సమాచారం.
దాంతో 7,8 మధ్య ఒప్పుకోమని వారు నానితో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ కాస్త మొత్తం ఇవ్వడం మైత్రిమేకర్స్‌ని పెద్ద అమౌంట్ కాకపోవచ్చు. కానీ ఒకసారి కమిట్ అయితే ఆతర్వాత చిత్రాలకు ఇక ఆ రేటు పెరుగుతుందే గానీ తగ్గదు కదా...! కాబట్టి రవితేజ చేసిన తప్పుని నాని చేయకూడదని, చిన్న, మంచి చిత్రాలకు ఆయన అందుబాటులో ఉండాలని కోరుకుందాం.