కొన్ని చిత్రాలలో నటించే నటీనటుల విషయంలో జరిగే మార్పులు, అనుకున్నవారు నో చెప్పడం వల్ల ఆ పాత్రలు ఇతరులకు వెళ్లి ఎలాంటి క్రేజ్‌ని తీసుకొస్తాయో చెప్పేందుకు లేటెస్ట్‌గా వచ్చిన 'బాహుబలి'లో శ్రీదేవి అనుకుని రమ్యకృష్ణ చేత చేయించిన శివగామి పాత్ర ఒకటి. ఆ పాత్ర ఆమెకి ఎంత పేరు తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పుడు అలాంటి ఓ పాత్రనే శ్రియాశరన్ చేస్తోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మోహన్‌బాబు ద్విపాత్రాభినయం చేస్తోన్న 'గాయత్రి' చిత్రం ఈనెల 9వ తేదీన విడుదల కానుంది. ఇందులో మోహన్‌బాబు హీరోగా, విలన్‌గా రెండు పాత్రలను దాదాపు 18ఏళ్ల తర్వాత చేస్తున్నాడు.
ఇక ఇందులో మోహన్‌బాబు చేసే శివాజీ పాత్రకు సంబందించిన యువ పాత్రను కూడా దర్శకుడు మదన్ మోహన్‌బాబు చేతనే చేయించాలని భావించాడట, కానీ మోహన్‌బాబు ఆ వయసు పాత్ర నేను చేయకూడదని చెప్పి మోహన్‌బాబు పాత్ర అయిన శివాజీ యంగ్ క్యారెక్టర్‌ని మంచు విష్ణు చేత చేయించాడు. ఈయనకు జతగా సీనియర్ స్టార్ శ్రియా శరణ్ నటిస్తోంది. ఈ పాత్ర పరంగా ఇందులో ఓ సీనియర్ స్టార్‌ని పెట్టుకోవాలని చూశారట. బాలీవుడ్ నటి కాజోల్, మాధురి దీక్షిత్‌లను కూడా కలిసి సంప్రదింపులు జరిపినా వారు నో అనే సరికి, మంచు విష్ణు భార్య సలహా మేరకు శ్రియాని తీసుకున్నారట. అంటే శ్రీదేవి 'బాహుబలి'కి నో చెప్పి 'పులి'లో నటించినట్లు, కాజోల్ కూడా తప్పులో కాలేసి 'విఐపి 2'లో చేసి రేపు 'గాయత్రి' లో చాన్స్ మిస్ చేసుకున్నందుకు బాధపడే రోజు వస్తుందని ఈ చిత్రం యూనిట్ చెబుతోంది.
అంత గొప్పగా ఈ శ్రియా పాత్ర ఉంటుందని అంటున్నారు. ఇక శ్రియ మొదటి చిత్రం 'ఇష్టం'నాటికి మంచు విష్ణు బహుశా కాలేజీ స్టూడెంట్‌గా ఉండి ఉంటాడు. మొత్తానికి మంచు విష్ణు వంటి యంగ్ హీరో సరసన సీనియర్ హీరోయిన్ శ్రియను మదన్ ఎంపిక చేయడం చూస్తే సమ్‌థింగ్ స్పెషల్ అనే ఆసక్తి మాత్రం కలుగుతోంది.