పెద్దవాళ్లు ఎవరు చేయాల్సిన పని వారు చేయాలి.. అంటారు. అది కొన్ని విషయాలలో నిజమని కూడా తెలుస్తుంది. తమలోని బహుముఖ ప్రజ్ఞను చాటుకోవాలని అందరికీ కోరికగానే ఉంటుంది. కానీ పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకునే పరిపక్వత ఉండాలి. రచయితగా రాజమౌళి సక్సెస్‌కి కుడిభుజం వంటి ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకునిగా రాణించలేక ఎవరు చేయాల్సిన పని వారు చేయాలని తనకి తెలిసి వచ్చిందని ఓ మాట చెప్పాడు. ఇక నేడు రచయితలు నటులవుతున్నారు. నటులు నిర్మాతలవుతున్నారు. రచయితలు దర్శకులవుతున్నారు. అయితే ఏదో ఒక రంగంలో పూర్తిగా తమను తాము నిరూపించుకున్న తర్వాతే వేరే పనిలో వేలు పెడితే బాగుంటుంది.
ఇక విషయానికి వస్తే తాజాగా మోహన్‌బాబు 'గాయత్రి' చిత్రం చేస్తున్నాడు. ఇక కొంతకాలంగా మోహన్‌బాబు దర్శకత్వం వహిస్తాడని వార్తలు వస్తున్నాయి. విష్ణుతో తీసే 'కన్నప్ప' చిత్రంతో ఆయన మెగాఫోన్ చేతబడతాడని వార్తలు వచ్చాయి. అయితే తాను నిర్మాత, నటుడు, స్క్రీన్‌ప్లే రచయితగానే ఉంటానని, తన కోపానికి దర్శకత్వం చేస్తే రోజుకొకరిని కొట్టాల్సి వస్తుంది కాబట్టి దర్శకత్వానికి నో అని చెప్పి తన అనుభవంతో మంచి మాట చెప్పాడు. మరోవైపు ఆయన చిన్నకుమారుడు మంచు మనోజ్ పాటలు పాడటం, రాయడం, డ్యాన్స్, ఫైట్స్ కొరియోగ్రఫీతో పాటు దర్శకత్వంలో కూడా వీలున్నంత వేలు పెడుతాడనే పేరుంది. ఇక మంచు విష్ణు, మంచు మనోజ్‌లకు తమిళ హీరోలుగా ఉండి బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న ధనుష్, శింబులంటే బాగా ఇష్టం. వారిలాగే తాము కూడా అన్ని చేయాలని ఉబలాటపడుతుంటారు.
ఇక తాజాగా హీరోగా 'ఢీ, దేనికైనారెడీ' కాస్తో కూస్తో 'ఆడో రకం.. ఈడో రకం' తప్ప మరో పెద్దగా హిట్ లేని మంచు విష్ణు దర్శకుడిగా మారి మెగాఫోన్ చేపట్టనున్నాడట. ఈయన కోపంలో తన తండ్రికి తగ్గ వారసునిగా 'దేనికైనా రెడీ' సమయంలో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఈయన 'గాయత్రి' చిత్రంలో శివాజీ అనే కీ రోల్‌తో పాటు 'ఆచారి అమెరికా యాత్ర'లో నటిస్తున్నాడు. దీని తర్వాత 'ఓటర్' అనే చిత్రం లైన్‌లో పెట్టాడు. ఇవి పూర్తి అయిన తర్వాత మంచు విష్ణు దర్శకత్వం వహించే చిత్రం ఉంటుందని అంటున్నారు. ఇక ఈయన తన తండ్రి చేయని పనిని ఎలా చేస్తాడు? అనేది ఒక ప్రశ్న అయితే నటులుగా వారసులు ఉండవచ్చేమో గానీ క్రియేటివ్ ఫీల్డ్‌లో వారసత్వాలు పనికిరావని, కేవలం టాలెంటే పనికి వస్తుందని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపితమైంది.
ఇక ఈయన పేరుకే దర్శకుడని, తమ బేనర్‌లోని దర్శకుల సాయంతోనే ఈయన నడవనున్నాడని కొందరు అంటుంటే, రవితేజ, నాని, రాజ్‌తరుణ్ వంటి వారి కంటే ముందుగా మంచు విష్ణునే దర్శకునిగా మారనున్నాడని కొందరు అంటున్నారు. మరి చూద్దాం.. ఇదైనా ఆయనకి అచ్చి వస్తుందో రాదో...!