సామాన్యంగా సినిమా ఫీల్డ్‌లో పొగడ్తలు మామూలే కాబట్టి అందరు స్టార్ హీరోలను, దర్శకులను పొగడ్తలతో ముంచేస్తూ ఉంటారు. ఇక స్టార్స్ పక్కన చాన్స్ వస్తే హీరోయిన్లు ఇక వారి గురించి చెప్పిందే చెబుతుంటారు. అయితే కొందరి విషయాలలో మాత్రం అవి పొగడ్తలు కావు.. అవి నిజాలే అని నమ్మబుద్ది అవుతోంది. అలాంటి విషయం గురించే మహేష్ - కొరటాల శివ కాంబినేషన్‌లో 'శ్రీమంతుడు' తర్వాత వస్తున్న 'భరత్ అనే నేను' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న కైరా అద్వానీ చెబుతోంది. మహేష్ కేవలం తన సీన్స్ వరకు చేసి కామ్‌గా ఉండరు. ప్రతి సన్నివేశం బాగా రావాలంటే తానొక్కడి నటనే కాదు... అందరు బాగా నటిస్తేనే సీన్ పండుతుందనే ఉద్ధేశ్యంతో తన కాంబినేషన్‌లో లేని సీన్స్‌ని కూడా మానిటర్‌లో చూసి, దర్శకుడు కొరటాల శివ ఆలోచనలకు అనుగుణంగా సీన్స్ బాగా వస్తున్నాయా? లేదా? అని గమనిస్తూ ఉంటాడట. క్లోజప్ షాట్స్‌ని కూడా మానిటర్‌లో చూసి అవసరమైన వారికి తగు సూచనలు కూడా ఇస్తుంటాడని కైరా అద్వానీ తెలిపింది.
నిజమే.. ఈ మధ్య వస్తున్న కొన్ని చిత్రాలను చూస్తే అసలు ఆ స్టోరీలు, పాత్రలను హీరోలు విని ఓకే చేశారా? లేక ఏదో మంచి డైరెక్టర్, బేనర్ అని చూసి ఏమీ తెలుసుకోకుండా నటించారా? అనే అనుమానం వస్తుంది. మహేష్ కూడా 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' విజయాన్ని చూసి గుడ్డిగా శ్రీకాంత్ అడ్డాలను నమ్మి 'బ్రహ్మూెత్సవం' చేశాడా? కేవలం మురుగదాస్‌ని చూసి 'స్పైడర్' చేశాడా? అనే అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది. దాంతో 'భరత్ అనే నేను' విషయంలో మహేష్ ప్రతి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడని వస్తున్న వార్తలకు బలం చేకూరేలా కైరా అద్వానీ అభిప్రాయం ఉంది.
ఇక మహేష్ షూటింగ్‌లో ఎంతో సరదాగా, జోక్ వేస్తూ బాగా కలుపుగోలుగా ఉంటాడని కూడా అంటారు. దాని గురించి కైరా మాట్లాడుతూ, ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసి, ఎంత కష్టమైనా సరే పడినా కూడా సాయంత్రం మహేష్ వేసే ఒకే జోక్‌తో తామంతా రిలాక్స్ అయిపోతామని, మహేష్ వంటి హీరోని చూడలేదు. మహేష్ ఉంటే సెట్‌లో ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆయన పాత్రల్లో లీనమయ్యే తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తోందని ఈమె బోలెడు కబుర్లు చెబుతోంది. ఇదే మాటలతో ఆమె మొదటి చిత్రం రిలీజ్ కాకుండానే రామ్‌చరణ్-బోయపాటి చిత్రంలో చాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే.