ఒకవైపు మెగాహీరో వరుణ్‌తేజ్ తన బాబాయ్ ఎవర్‌గ్రీన్ హిట్ టైటిల్ 'తొలిప్రేమ'తో ప్రేక్షకుల ముందుకు 10వ తేదీన వస్తుంటే, మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ మాత్రం ఒకరోజు ముందే అంటే 9వ తేదీన 'ఇంటెలిజెంట్'గా రానున్నాడు. మొదటి చిత్రం 'రేయ్'ని వదిలేస్తే మొదటి మూడు చిత్రాలతో ఓకే అనిపించిన సాయిధరమ్‌తేజ్ తర్వాత వచ్చిన 'తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్' ఇలా అన్ని చతికిలేశాయి. దాంతో ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో సాయి ఉన్నాడు. ఇక ఈయనకు వినాయక్ తోడుగా నిలిచాడు. ఈ మధ్య కాలంలో 'ఖైదీనెంబర్ 150' వంటి రీమేక్ , అందునా చిరంజీవి ఖాతాలో పడిపోయిన క్రెడిట్ తప్ప వినాయక్‌లో నాటి జోరు లేదు. 'అల్లుడుశీను, అఖిల్' అంటూ దెబ్బలు తింటున్నాడు.
ఇక నిర్మాతగా పెద్దగా సక్సెస్‌లు లేని సి.కళ్యాణ్ 'ఇంటెలిజెంట్'ని నిర్మిస్తున్నాడు. వరుసగా నాలుగు ఫ్లాప్స్‌తో డీలా పడ్డ మెగా మేనల్లుడితో ఏకంగా బాలయ్య కంటే ఎక్కువ బడ్జెట్‌ని పెట్టి ఈ చిత్రం కళ్యాణ్ నిర్మిస్తుండటం ఆశ్చర్యకరం. ఇక ఇప్పటికే తన పెద్ద మామయ్య చిరంజీవి రెండు పాటలను రీమిక్స్ చేసి సక్సెస్ అయిన తేజూ మరోసారి ఈ చిత్రంలో 'కొండవీటి దొంగ'లోని 'చమక్ చమక్' రీమిక్స్‌తో వస్తున్నాడు. మరోవైపు గతంలో వినాయక్ రామ్‌చరణ్‌తో చేసిన 'నాయక్' చిత్రంలోని చిరు 'కొండవీటి దొంగ'లోని 'శుభలేఖ రాసుకున్నా' వంటి రీమిక్‌ని ఒరిజినల్ స్థాయిలో అందంగా చూపించలేక, తమన్ చేతిలో చెడగొట్టిన రీమిక్స్‌గా ఆ పాట గుర్తుండి పోతుంది. ఇక తేజూ నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ని చూస్తే వినాయక్ స్టైల్‌లోనే పక్కా రొటీన్ ఫార్ములా అని అనిపిస్తోంది. ముఖ్యంగా రచనను ఆకుల శివ అందించడం వల్ల కాబోలు 'నాయక్' ఛాయలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, పోసాని.. ఇలా అదే ట్రూప్ కంటిన్యూ అయింది. తేజ అనే సాప్ట్‌వేర్ ఇంజనీర్ తెలివిగా విలన్లను చంపి, అందరినీ రఫ్ఫాడించే ధర్మాభాయ్‌గా అవతారం ఎత్తడమే ఈ పాయింట్ కూడా. మహా అయితే బిసి ప్రేక్షకులను ఆకట్టుకోగలదేమో గానీ ఓవర్‌సీస్ ప్రేక్షకులను, మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ని మెప్పించాలంటే దర్శకుడు కూడా ఈ రోటీన్ కథను ఎంతో ఇంటెలిజెంట్‌గా, లాజిక్కులు మిస్ కాకుండా ఉంటేనే సాధ్యం.
ఇక పెద్ద మామయ్య రీమిక్స్ సరిపోదు అన్నట్లుగా మార్షల్ ఆర్ట్స్ లుక్‌లో పవన్‌లా కనిపించడం, 'బద్రి' చిత్రంలోని 'చకితా' పాట గెటప్పు చూస్తుంటే మొత్తానికి మెగామేనల్లుడు ఈ విషయంలో నితిన్‌ని మర్చిపోయాడనే చెప్పాలి. ఎంతైనా టైటిల్‌ని 'తొలిప్రేమ'గా పెట్టుకున్నా కూడా ఆ టచ్‌లో ఉండదని నిజాయితీగా చెబుతున్న వరుణ్‌తేజ్‌నే మెచ్చుకోవాలి. సాయి ఇంకెంత కాలం తన మావయ్యల రిఫరెన్స్‌లతో కాలం గడుపుతాడో వేచిచూడాలి...!