గతంలో చిరంజీవి ఇంట్లో దొంగతనం జరిగి నగదు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయి. చిరంజీవి కుటుంబం ఎంతో నమ్మిన ఇంట్లోని పని చేసే వ్యక్తే ఆ దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరినైనా పట్టవచ్చు గానీ ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనడానికి ఇదో ఉదాహరణ. ఇక తాజాగా సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో నాలుగు లక్షల నగదు చోరీకి గురైంది. గత కొంతకాలంగా ఫిల్మ్‌నగర్‌లో ఉంటున్న సంగీత దర్శకుడు మణిశర్మ తన సొంత అవసరాల నిమ్తితం 4లక్షల నగదును బీరువాలో ఉంచాడట. అవసరాల కోసం తాజాగా బీరువా తీసి చూస్తే అందులో నగదు మాయం కావడం గమనించాడు.
దాంతో ఆయన తన మేనేజర్ సుబ్బానాయుడు ద్వారా బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు. ఇది కూడా ఇంటి దొంగల పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై బంజారా హిల్స్ పోలీసులు విచారణ చేస్తున్నారు. అయినా నేటి రోజుల్లో ఎవ్వరినీ నమ్మలేకపోతున్నామని ముఖ్యంగా ధనవంతుల ఇళ్లలో పని చేసేవారు నగదు, చోరీలతో పాటు పలు అనుమాస్పద వివాదాలకు, ఘటనలకు కారకులుగా మారుతున్నారన్న వార్తలు బాగా వినిపిస్తున్నాయి.