ఆ మధ్య ఓ హీరోయిన్ తన కాలేజీ రోజుల్లో లోకల్ ట్రైన్ ఎక్కితే ఓ వ్యక్తి తమ ముందు హస్తప్రయోగం చేస్తూ దారుణంగా ప్రవర్తించాడని వాపోయింది. అనుష్క ఓ వేడుకు వెళ్లితే ఆమెని తాకకూడని చోట ఓ వ్యక్తి తాకాడు. శ్రియ తిరుమల వెళ్లితే అంతటి పవిత్ర ప్రదేశంలో కూడా ఒకరు ఆమె పట్ల వైపరీత్యం ప్రదర్శించాడు. తమన్నా ఓ వేడుకకు వెళ్లితే చెప్పు విసిరాడు ఓ మహానుబాహుడు. అమలాపాల్‌పై కూడా లైంగిక వేధింపులు జరిగాయని ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇక 'బంగారం' చిత్రంలో పవన్‌కళ్యాణ్‌కి మరదలిగా, బాలనటిగా 40కి పైగా చిత్రాలలో నటించి 'జీనియస్'తో హీరోయిన్‌గా మారిన సనూష చెన్నై నుంచి కేరళ వెళ్తుండగా ఓ ఆకతాయ అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతడి చేయి పట్టుకుని లైట్స్ వేసి రైల్వే పోలీసులకు ఆయన్ను ఎంతో ధైర్యంగా పట్టించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న తోటి ప్రయాణికులు మౌనంగా ఉండటం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ విషయం గురించి నాగచైతన్యతో 'సాహసం శ్వాసగా సాగిపో' హీరోయిన్, మలయాళ నటి మంజిమా మోహన్ తీవ్రంగా స్పందించింది. అసలు సనూష విషయంలో ఓ వ్యక్తి అలా వ్రవర్తిస్తుంటే తోటి ప్యాసింజర్లందరూ అలా మౌనంగా ఎందుకు ఉన్నారు అనేది అర్ధం కావడం లేదు. ఆ సమయంలో వారు ఏమి ఆలోచించి, అలా మౌనంగా ఉన్నారో అర్ధం కాని పరిస్థితి. ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లేటప్పుడు పెప్పర్‌స్ప్రే వంటి వాటిని బ్యాగులో తీసుకెళ్లు అని నా సోదరుడు చెప్పేవాడు. నేను ఇంకా పాతకాలంలో లేం. నాటి రోజులతో పోల్చుకుంటే నేటి సమాజంలో మహిళలకు ఎంతో సేఫ్టీ ఉందని వాదించాను.
కానీ ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే నా బ్రదర్ మాటే నిజమని, నా మాట తప్పని అర్ధమవుతోంది. ఇప్పుడు జరుగుతున్న అక్రమాలు చూస్తుంటే పెప్పర్‌స్ప్రేనే కాదు అంతకు మించిన వస్తువును ఏదైనా బ్యాగ్‌లో ఉంచుకోవాలేమో అనిపిస్తోంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. మహిళలను కేవలం సెక్స్ వస్తువుగా చూడటం మానుకోవాలి. వారి అభిప్రాయాలకు, ఆత్మగౌరవానికి విలువ ఇవ్వాలి.. అని చెప్పుకొచ్చింది. ఇక ఈమె ప్రస్తుతం బాలీవుడ్‌లో కంగనారౌనత్ నటించిన 'క్వీన్' మలయాళ రీమేక్ 'జామ్ జామ్'లో నటిస్తోంది.