ఎన్టీఆర్ తన జీవితంలో కాంగ్రెస్‌కి బద్దశత్రువుగా, ఇందిరాగాంధీ మాటే గిట్టని వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన టిడిపి కేవలం యాంటీ కాంగ్రెస్ మీదనే ఆధారపడి ఉంది. ఇక ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఇందిరాగాంధీది కూడా కీలకపాత్ర ఉంది. ఎన్టీఆర్‌ని ముఖ్యమంత్రి పదవి నుంచి దించివేసి గవర్నర్ రామ్‌లాల్‌తో ఆమె రాజకీయం నడిపింది. ఆ తర్వాత కూడా నాదెండ్ల భాస్కర్‌రావుని ముఖ్యమంత్రిని చేసింది. కానీ ఎన్టీఆర్ ఆమెపై తిరగబడి మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాడు.
సో.. బాలకృష్ణ, తేజల దర్శకత్వంలో వచ్చే బాలయ్యాస్ ఎన్టీఆర్ చిత్రంలో ఇందిరాగాంధీ, నాదెండ్లభాస్కర్‌రావు పాత్రలను ఎవరు చేస్తారా? అనే ఆసక్తి మొదలైంది. ఇక ఈ చిత్రంలో ఇందిరాగాంధీ పాత్ర కోసం నాటి లేడీఅమితాబ్ విజయశాంతిని తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం విజయశాంతి తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పాత్రను పోషిస్తోంది. దీంతో ఎన్టీఆర్ బయోపిక్‌లో కాస్త నెగటివ్ టచ్ ఉండే ఇందిరా పాత్రను ఆమె చేసే అవకాశాలైతే లేవనే చెప్పాలి. ఇక సెకండ్ ఆప్షన్‌గా నదియా పేరు ప్రస్తావనకి వస్తోంది. నదియా ఈ పాత్రకు బాగానే సూట్ అవుతుందని భావించవచ్చు.
కాగా ప్రస్తుతం తేజ వెంకటేష్‌తో చిత్రం చేస్తూనే ఎన్టీఆర్ బయోపిక్ ప్రీప్రొడక్షన్ పనులు పర్యవేక్షిస్తున్నాడు. బాలకృష్ణ కూడా 'జైసింహా' తర్వాత ఎన్టీఆర్ బయోపిక్‌పై దృష్టి పెట్టేందుకు సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చి, ఈ మద్యలో మరో చిత్రం చేసే అవకాశం ఉన్నా కూడా ఈ చిత్రం పనులన్నీ తన కనుసన్నలలో జరిగేలా చూసుకుంటున్నాడు. ఇక ఎంతో కాలంగా బాలయ్య భుజం నొప్పితో బాధపడుతున్నాడు. తాజాగా ఆయన భుజానికి శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నాడని, సర్జరీ సక్సెస్ అయిందని నందమూరి వర్గాలు తెలుపుతున్నాయి.