మన ప్రేక్షకుల తప్పో.. లేక మేకర్స్ తప్పో తెలియదు గానీ బాలీవుడ్‌లోలాగా కోలీవుడ్, టాలీవుడ్‌లలో హీరోయిన్లకు పెళ్లయిన తర్వాత ఆదరించే మంచి సుగుణం ఇక్కడ లేదనే చెప్పాలి. అదే హాలీవుడ్‌నుంచి బాలీవుడ్ వరకు ఎక్కువ మంది హీరోయిన్లు వివాహం జరిగిన తర్వాతనే తమదైన పరిణితితో అద్భుతమైన పాత్రలకు జీవం పోశారు. ఇక తాజాగా కన్నడ 'కిర్రాక్‌పార్టీ'తో వెండితెరకు పరిచయమైన రష్మిక మండన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఒక్క చిత్రంతోనే ఆమె టాలీవుడ్ దర్శకనిర్మాతలు, హీరోలచూపును తన వైపుకు తిప్పుకుంది.
ఈమె ప్రస్తుతం నాగశౌర్యతో కలిసి 'ఛలో' చిత్రంలో నటిస్తోంది. ఇందులో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే గ్రామాలలో జరిగే ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రా బోర్డర్ కథగా దర్శకుడు కథ రాసుకున్నాడు. ఆయనది ఆంధ్రా, తెలంగాణ బోర్డర్ కావడంతో రాష్ట్రం విడిపోయిన నేపధ్యంలో జరిగిన వాస్తవాలకు తెరరూపం ఇస్తున్నాడు. అయితే ఎందుకు గొడవ అనుకున్నాడో ఏమో గానీ చిత్రం సబ్జెక్ట్‌ని ఆంధ్రా, తమిళనాడు బోర్డర్‌గా చూపించాడు. ఇందులో రష్మిక మండన్న సరిహద్దు దాటి వచ్చి హీరోని ప్రేమించే పాత్రను చేస్తోంది. ఇక ఈమె తనకు అనుష్కలా మంచి పాత్రలు చేయాలని ఉందని అంటోంది.
అయితే మరో గమ్మత్తేమిటంటే ఈమె తన మొదటి చిత్రం 'కిర్రాక్‌పార్టీ'లో నటించిన రక్షిత్‌శెట్టితో ప్రేమలో పడింది. ఇరువురి మనసులు కలిశాక పెద్దల అనుమతి కూడా తీసుకున్నామని త్వరలో ఒకరం కాబోతున్నానని చెబుతూనే తనకు అనుష్క తరహా పాత్రలు చేయాలని అడగటం చూస్తే దక్షిణాదిలో అవ్వ కావాలి.. బువ్వా కావాలి.. అంటే కష్టమని, పెళ్లి లేదా నటన ఏదోఒకటి ఎంచుకుంటే తప్ప ఆమెకి అనుష్కలా పేరు తెచ్చుకునే అవకాశం లేదని మాత్రం చెప్పవచ్చు. అయినా నేటి యువతరానికి ప్రతినిధిగా ఆమె అనిపిస్తోందని మాత్రం చెప్పవచ్చు. కెరీర్ కెరీరే.. కెరీర్‌కంటే రియల్‌లైఫ్ ఎంతో ముఖ్యం అనే సూత్రాన్ని ఈ భామ పాటిస్తోందని చెప్పవచ్చు.