సాధారణంగా సినిమాలలో సూపర్‌క్రేజ్ తెచ్చుకున్న వారు తాము దేవుడితో సమానం అనే ఊహల్లో విహరిస్తూ ఉంటారు. వారు ఆ భ్రమల్లో బతుకుతున్నందున, అభిమానులు కూడా అలాగే ప్రవర్తించడం మూలంగా వారు వాస్తవాలలోకి రాలేరు. ఇది ఎందరో విషయాలలో స్పష్టమైన విషయం. ఇక తమను తాము ఎక్కువగా ఊహించుకోవడం, సినిమాలలో తమకి తిరుగేలేదు కాబట్టి రాజకీయాలు కూడా అలాగే ఉంటాయని భావిస్తుంటారు. ఇదే భ్రమలో చివరకు మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండటం వల్లే రాబోయే ఎన్నికల్లో కాబోయే సీఎంని అని భావించి భ్రమించాడు.
ప్రస్తుతం జగన్ కూడా ఎక్కడికి వెళ్లినా నేను సీఎంని కావడం ఖాయం అంటున్నాడు. కానీ ఈ విషయంలో పవన్ మాత్రం తనదైన ప్రత్యేకత చూపుతున్నాడు. ఆయనకు తాను సీఎంని కాగలిగిన స్థాయి ఇప్పట్లో లేదని స్పష్టమైన క్లారిటీతో ఉన్నాడు. తన బలం పరిమితమే అయినా అదే వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారుతుందని కూడా ఆయన గ్రహించాడు. ఇక సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది కాకుండా ఈ ఏడాది చివరలోనే ఉండవచ్చనే నిర్ణయం అర్ధమయి, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటించాడు.
ఇక తాను ఎవరికి మద్దతు ఇస్తానా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, రైతుల కోసం ఎవరు పనిచేస్తారో వారికే తన మద్దతు ఉంటుందని, ఇక ఎవరికైనా మద్దతు ఇచ్చే సమయంలో అనంతపురంకి ఏమి చేస్తారు? అని ప్రశ్నించి సరైన సమాధానం వస్తేనే మద్దతు ఇస్తానని తేటతెల్లం చేశాడు. సో.. ఈసారి కూడా పవన్ గతంలో టిడిపి-బిజెపికి మద్దతు తెలిపినట్లుగా.. రాబోయే ఎన్నికలకు ముందు లేదా తర్వాత పొత్తు తప్పనిసరి అనే స్పష్టమైన ఆలోచనలో పవన్ ఉన్నాడు. మరోవైపు తాను సమస్యలను ప్రస్తావిస్తుంటే అభిమానులు ఈలలు, చప్పట్లు కొట్టడం సరికాదని ఆయన దిశానిర్దేశం చేస్తున్న విదానం ఆయనలోని పరిపక్వతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.