తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యుదైన వి.హన్మంతరావుని ముఖ్యమంత్రి అభ్యర్దిగా ప్రకటిస్తే కాంగ్రెస్ తరపున తెలంగాణలో ప్రచారం చేస్తానని జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ స్పష్టం చేశాడు. ఇక వి.హన్మంతరావు దీనిపై మాట్లాడుతూ, పవన్‌కళ్యాణ్ జనసేన ఎప్పటికైనా కాంగ్రెస్‌లోనే విలీనం కాక తప్పదని జోస్యం చెబుతున్నారు. మరోవైపు తనకి రాజకీయంగా తన అన్నయ్య చిరంజీవి, ఇతర కుటుంబ సభ్యుల మద్దతు లేదని పవన్ చెబుతున్నా రామ్‌చరణ్, సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్‌లు ఆయనకు అనుకూలంగా ట్వీట్స్ చేస్తున్నారు. బిజెపికి ఎలాగూ ఏపీలో భవిష్యత్తు లేదు. మరోవైపు ప్రత్యేకహోదా ఇవ్వకుండా మోసం చేసిందని పవన్ మండిపడుతున్నాడు. మరి వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ గెలిచి ప్రత్యేకహోదా ఇస్తే పవన్ కూడా తన అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యంని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్లు జనసేనని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేస్తాడని కొందరు విమర్శిస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత కెవిపి రామచంద్రరావు రాజకీయాలలో అవసరమైన సమయంలో పొత్తులు ఉంటాయే గానీ ఏ పార్టీ కూడా అంటరాని పార్టీ కాదని అంటున్నాడు. నిజమే.. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత అంటరాని పార్టీగా మారిన బిజెపికి తర్వాతి కాలంలో ఎందరో బద్దశత్రువులు కూడా మిత్రులయ్యారు. శివసేన వంటి పార్టీ ఇప్పుడు దూరం జరిగింది. కాబట్టి రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. ఇక తాజాగా ఏపీ కాంగ్రెస్‌పీసీసీ అద్యక్షుడు రఘువీరారెడ్డి కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసి చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, రెండురోజుల కిందట ఆయన రాహుల్‌గాంధీని కలిసి అద్యక్షునిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు కూడా తెలిపాడని బాంబు పేల్చాడు.
మరి చిరంజీవి అంత రహస్యంగా రాహుల్‌గాంధీని కలవాల్సిన అవసరం ఏముంది? మీడియాకు కూడా తెలియకుండా దొంగచాటుగా కలవాల్సిన పరిస్థితులు ఏమిటి? అనేవి ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. ఇక నిన్నటివరకు కాంగ్రెస్‌లో చిరంజీవి క్రీయాశీలకంగా ఎందుకు లేరు అని ప్రశ్నిస్తే అధిష్టానం పర్మిషన్ తీసుకుని 150వ చిత్రం చేస్తున్నాడని, ఆ బిజీగా ఉండటం వల్లే ఆయన క్రీయాశీలకంగా పాల్గొనడం లేదని కాంగ్రెస్‌నాయకులు అంటున్నారు. ఇప్పుడు అడిగితే 151వ చిత్రంలో బిజీగా ఉన్నాడని అంటున్నారు. మరి సినిమాలలో బిజీగా ఉండటం అనేది కామనే.
అయినా కాంగ్రెస్‌పార్టీ త్వరలో కర్ణాటక ఎన్నికలలో పోరాడాల్సి ఉంది. కర్ణాటకలో చిరంజీవికి ఎంతో ఫాలోయింగ్ ఉంది. మరోవైపు బిజెపి కేంద్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్తుందనే సంకేతాలు వస్తున్నాయి. మరి వీటిలో కాకుండా చిరంజీవి 'సై..రా'లోనే బిజీగా గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అప్పుడు కాంగ్రెస్ నేతలు ఏ వంక చెబుతారో వేచిచూడాల్సివుంది...!