1970 మొదలుకుని ఆయన సంగీత ప్రభంజనం సృష్టించారు. దేశంలోని అన్ని ప్రధాన భాషా చిత్రాలకు సంగీతం అందించి శ్రోతలను ఉర్రూతలూగించారు. ఆయన చూసేందుకు చాలా గర్విష్టిగా కనిపిస్తాడు. కానీ అది కళాకారులకు సాధారణంగా ఉండే ఆభరణం వంటి ఆత్మవిశ్వాసం. ఈయన ఇప్పటి వరకు 1000కి పైగా చిత్రాలకు సంగీతం అందించి మ్యాస్ట్రో ఇళయరాజాగా పేరు తెచ్చుకున్నారు. 1943లో జ్ఞానతెలిసకన్ అనే పేరును ఆయన గురువు ఇళయరాజాగా మార్చారు. అలా ఈయన లయ రాజా ఇళయరాజాగా పేరు తెచ్చుకున్నారు. తన కెరీర్‌లో ఎన్నో అవార్డు చిత్రాలకు సంగీతం అందించి పండిత పామరులను అలరించారు. ఇక ఈయనకు ఇప్పటికే పలు అవార్డులు, రివార్డులు వచ్చి ఉన్నాయి. 2012లో సంగీత నాటక అకాడమీ పురస్కారం, 2014లో శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ అవార్డు, 2015లో గోవాలో జరిగిన 46వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో జీవిత సాఫల్య పురస్కారం పొందారు. ఈయన తరంలో ఈయనను మించిన సంగీత దర్శకుడు లేడనే చెప్పాలి. రాగాలతో ప్రయోగాలు చేయడంలో ఆయన దిట్ట. ఆయన ట్యూన్ చేసిన పాటలను పాడటం అంటే గాయనీ గాయకులకు ఇష్టమే కాదు.. కఠినమైన ఆయన కంపోజింగ్‌కి తగ్గట్లుగా పాడటం ఓ సవాలే. 2010కి గాను పద్మభూషణ్ అందుకున్న ఆయనకు తాజాగా 2018కి గాను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుని ఇవ్వడం సంతోషదాయకం. ఇక ఈ అవార్డు తనని వరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాకు అవార్డు వచ్చిందంటే తమిళ ప్రజలందరినీ కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లేనని పేర్కొన్నారు. ఇక ఈయనకు రజనీకాంత్, కమల్‌హాసన్ వంటి వారు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.